ఆంధ్రప్రదేశ్‌లో యూరియా కొరతపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు వార్నింగ్ ఇచ్చారంటూ, జైల్లో పెడతామంటూ ఘాటుగా మాట్లాడారంటూ ఒక వీడియో వైరల్ అయింది. ఈ వీడియోపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందిస్తూ స్పష్టత ఇచ్చింది.
వాస్తవానికి సీఎం చంద్రబాబు గత వారం యూరియా అంశంపై సమీక్ష నిర్వహించారు. ఆ సమయంలో కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ, రైతుల ముసుగులో గొడవలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఎరువులు పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు యూరియా వాడకం తగ్గించాలని, రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయాలు వాడాలని సూచించారు.
ఫ్యాక్ట్ చెక్ టీమ్ తెలిపినదేమిటంటే – ముఖ్యమంత్రి వ్యాఖ్యలను కత్తిరించి, ఎడిట్ చేసి రైతులకు వార్నింగ్ ఇచ్చినట్లు చూపించే ప్రయత్నం జరిగిందని. రైతులు, ప్రజలు ఇటువంటి తప్పుడు వీడియోలను నమ్మకూడదని, షేర్ చేయకూడదని హెచ్చరించారు. ఇటువంటి వీడియోలు తయారుచేసి ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
చంద్రబాబు మరోసారి వైఎస్సార్‌సీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యల్ని రాజకీయాలకు వాడుకోవద్దని హెచ్చరించారు. తప్పుడు వార్తలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, ఇక సహించేది లేదని హెచ్చరించారు. రైతుల ఆరోగ్యం దృష్ట్యా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని, వాటికి ప్రత్యామ్నాయాలపై రాయితీలు అందిస్తామని తెలిపారు.