ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల పట్ల తన ఆదరాభిమానాన్ని చాటారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని మక్కువ మండలానికి చెందిన మారుమూల గ్రామాల ప్రజల అవసరాలను తెలుసుకొని ఆయన ప్రత్యేక సహాయాన్ని అందించారు.
ఈ క్రమంలో సిరివర, బాగుజోల, చిలకమెండంగి, బండమెండంగి, డొయివర, తాడిపుట్టి గ్రామాల్లోని 222 గిరిజన కుటుంబాలకు పవన్ కళ్యాణ్ రగ్గులను పంపించారు. దీనిని జిల్లా పీడీ రామచంద్రరావు అధికారికంగా వెల్లడించారు. గతంలో మక్కువ మండలంలో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమానికి హాజరైన పవన్ కళ్యాణ్, అక్కడి ప్రజలతో మాట్లాడి వారి అవసరాలను నేరుగా తెలుసుకున్నారు. అప్పటినుంచి ఆయన వారితో అనుబంధం కొనసాగుతోంది.
అంతేకాకుండా, పవన్ కళ్యాణ్ గతంలో డుంబ్రిగూడ మండలంలోని పెదపాడు గ్రామ ప్రజలకు చెప్పులను గిఫ్టుగా పంపించారు. తాజాగా అదే నియోజకవర్గ పరిధిలోని కురిడి గ్రామస్తులకు తన సొంత తోటలో ఆర్గానిక్ పద్ధతిలో పండించిన మామిడి పండ్లను బహుమతిగా పంపించారు. గ్రామస్థులంతా పవన్ కళ్యాణ్ మద్దతుతో ఎంతో సంతోషంగా ఉన్నారు.
“మా గ్రామాన్ని గుర్తుపెట్టుకుని, స్వయంగా పండించిన మామిడి పండ్లు పంపించారు. పవన్ బాబు పది కాలాలపాటు ఆరోగ్యంగా ఉండాలి” అంటూ గ్రామస్తులు ఆనందంతో స్పందించారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో గిరిజనులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, వారికోసం ఇలాంటి మానవీయ చర్యలు చేపడుతున్న పవన్ కళ్యాణ్‌కు గిరిజనుల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.