కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో మరియు ఔట్‌ఫ్లో రెండూ 2.54 లక్షల క్యూసెక్కులుగా ఉన్నట్లు పేర్కొంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
APSDMA ప్రజలను నదిలో పంట్లు లేదా నాటు పడవలతో ప్రయాణించకుండా చూడాలని హెచ్చరించింది. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం వంటి పనులు ప్రమాదకరమని స్పష్టం చేసింది. పిల్లలు, వృద్ధులు నదికి దగ్గరగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. అలాగే, అవసరమైతే టోల్ ఫ్రీ నంబర్లు 1070, 112, 18004250101 లకు కాల్ చేయాలని సూచించింది. వరద ముప్పు నేపథ్యంలో ప్రజలు అధికారుల సూచనలను ఖచ్చితంగా పాటించాలని APSDMA విన్నవించింది.