భారతదేశ డిజిటల్ చెల్లింపుల రంగంలో యూపీఐ (Unified Payments Interface) మరో చరిత్ర సృష్టించింది. తొలిసారిగా ఒకే నెలలో 20 బిలియన్ల (2000 కోట్ల) లావాదేవీల మైలురాయిని దాటి రికార్డు నెలకొల్పింది. ఈ గణాంకాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆగస్టు నెలకు సంబంధించిన వివరాల రూపంలో విడుదల చేసింది.
ఎన్‌పీసీఐ ప్రకారం, ఆగస్టులో 20.01 బిలియన్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. జూలైలో నమోదైన 19.47 బిలియన్లతో పోలిస్తే ఇది 2.8% ఎక్కువ. వార్షిక ప్రాతిపదికన చూస్తే 34% వృద్ధి నమోదు అయ్యింది. లావాదేవీల విలువ రూ. 24.85 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 24% పెరుగుదల. సగటున రోజుకు 645 మిలియన్ల లావాదేవీలు జరిగాయని ఎన్‌పీసీఐ వెల్లడించింది.
ఇటీవల నెలలుగా యూపీఐ వినియోగం స్థిరంగా పెరుగుతూనే ఉంది. జూన్‌లో 18.40 బిలియన్ల లావాదేవీలు జరగగా, జూలైలో 19.47 బిలియన్లకు పెరిగింది. అదే వేగంతో ఆగస్టు 2న ఒకే రోజు 700 మిలియన్ల లావాదేవీల రికార్డు కూడా నెలకొల్పింది.
ఎస్బీఐ రీసెర్చ్ ప్రకారం, డిజిటల్ చెల్లింపుల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. జూలై నెలలో మొత్తం లావాదేవీల్లో 9.8% మహారాష్ట్ర వాటాగా ఉండగా, కర్ణాటక (5.5%), ఉత్తరప్రదేశ్ (5.3%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ముఖ్యంగా వినియోగదారుల నుంచి వ్యాపారులకు చేసే (P2M) చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. 2020లో ఇవి 39% మాత్రమే ఉండగా, ఇప్పుడు 64%కు పెరగడం విశేషం. కిరాణా షాపులు, రుణాల వసూళ్లు వంటి విభాగాల్లో యూపీఐ వినియోగం అధికంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది.