ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతులకు అండగా ముందుకు వస్తోంది. పశువులకు వ్యాధులు రాకుండా టీకాలు వేయడం, నట్టల నివారణ మందులు ఇవ్వడం, ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతోంది.
అదనంగా మినీ గోకులం షెడ్లను రైతులకు 100% రాయితీతో ఇస్తున్నారు. పశుగ్రాసం పెంచడానికి రైతులకు విత్తనాలు రాయితీ ధరకు అందిస్తున్నారు. అలాగే సమీకృత దాణా, గడ్డి విత్తనాలను కూడా ప్రభుత్వం తక్కువ ధరకు ఇస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాకు అవసరమైన విత్తనాల సంఖ్యను గుర్తించి పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా హైబ్రీడ్ జొన్న, మొక్కజొన్న విత్తనాలను రైతులకు 75% రాయితీతో అందిస్తున్నారు. ఉదాహరణకు – జొన్న 5 కేజీల ప్యాకెట్ ధర రూ.460 ఉండగా, రైతు తన వాటాగా రూ.115 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.
మొక్కజొన్న 5 కేజీల ప్యాకెట్ ధర రూ.340 ఉండగా, రాయితీ తర్వాత రైతు కేవలం రూ.85 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఒక్కో రైతుకు 5 కేజీల నుంచి 20 కేజీల వరకు విత్తనాలను ఇవ్వనున్నారు.