హైదరాబాద్‌లో రోడ్ల మరమ్మతులు చేయకపోయినా బిల్లులు వసూలు చేసే అక్రమాలు జరుగుతున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయడానికి GHMC కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నగరంలోని అన్ని రహదారుల వివరాలను డిజిటలైజ్ చేసి డేటాబేస్‌లో నమోదు చేయనుంది. ప్రతి రోడ్డుకు ప్రత్యేక డిజిటల్ ఐడీ కేటాయిస్తారు.

దీనికోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నారు. ఆ యాప్‌లో ప్రతి రోడ్డుకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. రోడ్డు ఎప్పుడు నిర్మించబడింది, ఏ ఏజెన్సీ పని చేసింది, డీఎల్పీ (Defect Liability Period) ఎంతవరకు ఉంది అనే వివరాలు నమోదు అవుతాయి. ఇలా చేయడం వల్ల రోడ్లను సరిగా మరమ్మతు చేయకపోయినా బిల్లులు వేసే దందాకు అడ్డుకట్ట పడుతుంది.

గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 9103 కిలోమీటర్ల మేర రహదారులు ఉన్నాయి. వీటిలో GHMC పరిధిలో ఉన్న రోడ్లు, R&B, NHAI, TGICC పరిధిలో ఉన్న రోడ్ల వివరాలు క్షేత్రస్థాయి సర్వే ద్వారా సేకరించనున్నారు. ఈ వివరాలు కూడా ఆ యాప్‌లోనే అందుబాటులో ఉంటాయి.

యాప్‌లో రోడ్డుకు సంబంధించిన అధికారుల సమాచారం కూడా జతచేస్తారు. దాంతో రోడ్డుపై సమస్య ఉంటే, దానికి బాధ్యుడు ఎవరో సులభంగా గుర్తించవచ్చు. దీంతో అక్రమాలకు చెక్ పడటమే కాకుండా, అధికారుల పనితీరు కూడా పారదర్శకంగా మారుతుంది.

ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రజాధనం వృథా కాకుండా కాపాడే అవకాశం ఉంది. ఒక్క క్లిక్‌తో రోడ్ల వివరాలు తెలుసుకోవచ్చని, రోడ్ల నాణ్యత, మరమ్మతులపై పర్యవేక్షణ సులభం అవుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో భవిష్యత్తులో రోడ్ల సమస్యలు తగ్గి, ప్రజలకు నేరుగా లాభం చేకూరనుంది.