జపాన్‌లో జరిగిన ఒక బాక్సింగ్ ఈవెంట్ తీవ్రమైన విషాదానికి దారితీసింది. టోక్యోలోని ప్రసిద్ధ కొరాకువెన్ హాల్‌లో జరిగిన పోటీల్లో ఇద్దరు యువ బాక్సర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 2న జరిగిన పోటీలో 28 ఏళ్ల షిగెటోషీ కొటారీ 12 రౌండ్ల పాటు సాగిన ఉత్కంఠభరిత పోరులో పాల్గొని, మ్యాచ్ ముగిసిన వెంటనే రింగులోనే కుప్పకూలిపోయారు. వైద్య సిబ్బంది తక్షణ చికిత్స అందించినా, ఆయనను రక్షించలేకపోయారు.
దీని తరువాత రోజు మరో మ్యాచ్‌లో 28 ఏళ్ల హిరోమాసా ఉరకావా ఫైనల్ రౌండ్‌లో నాకౌట్ అయ్యారు. ఆయనను ఆసుపత్రికి తరలించినా, బ్రెయిన్ ఇంజరీ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. వరుసగా రెండు రోజులలో ఇద్దరు బాక్సర్లు ప్రాణాలు కోల్పోవడం బాక్సింగ్ అభిమానులను, క్రీడా ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది.
ఈ ఘటనలపై వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. క్రీడాకారుల భద్రత కోసం రింగ్‌లో అవసరమైన జాగ్రత్తలు, వైద్య సౌకర్యాలను మరింత కఠినతరం చేయాలని క్రీడా నిపుణులు సూచిస్తున్నారు. బాక్సింగ్‌లో ఉన్న తీవ్రమైన శారీరక ఒత్తిడి, గాయాల ప్రమాదం మరోసారి వెలుగులోకి వచ్చిన ఘటనగా ఇది నిలిచిపోయింది.