మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత చాలా మంది అనుకోకుండా కొన్ని అలవాట్లను పాటిస్తుంటారు. కానీ ఇవి ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా లంచ్ చేసిన వెంటనే నిద్రపోవడం జీర్ణక్రియను మందగింపజేస్తుంది. దీని వల్ల గ్యాస్, అజీర్ణం, బరువు పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం కూడా శరీరానికి మంచిది కాదు. ఎందుకంటే, స్నానం సమయంలో రక్తప్రసరణ చర్మం వైపు ఎక్కువగా జరిగి, జీర్ణక్రియ ప్రక్రియకు అవసరమైన రక్తప్రసరణ తగ్గుతుంది. అలాగే భోజనం చేసిన వెంటనే చల్లటి నీరు లేదా చల్లని జ్యూసులు తాగడం జీర్ణక్రియను దెబ్బతీస్తుంది.
మరోవైపు, తిన్న వెంటనే నడకకు వెళ్లడం కూడా కడుపు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. నిపుణుల ప్రకారం, భోజనం చేసిన వెంటనే వాకింగ్ చేయడం వల్ల ఆహారం పూర్తిగా జీర్ణం కాకముందే కడుపులో కదలికలు మొదలై అసౌకర్యం కలిగించవచ్చు.
అత్యంత ప్రమాదకర అలవాటు భోజనం చేసిన వెంటనే సిగరెట్ తాగడం. ఈ సమయంలో సిగరెట్‌లోని హానికర రసాయనాలు శరీరంలో మరింత వేగంగా ఆవిర్భవించి గుండె, ఊపిరితిత్తులు, జీర్ణక్రియ వ్యవస్థపై తీవ్రమైన నష్టం కలిగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే భోజనం తర్వాత కనీసం 30 నిమిషాల నుంచి ఒక గంట వరకు ఈ అలవాట్లన్నింటినీ దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు.