తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి రామ్ (Pattabhi Ram Kommareddy) తీవ్ర ఆరోపణలు చేశారు. తిరుపతి ప్రజలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ఆదివారం తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పట్టాభి రామ్ అన్నారు – “ఇటీవల దళిత యువకుడు పవన్ను, భూమన అభినయ్ రెడ్డి అనుచరులు అనిల్ రెడ్డి, జగదీష్ రెడ్డి కిడ్నాప్ చేసి, దారుణంగా చిత్రహింసలు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో, పవన్ను బెదిరించి — తన సోదరుడే కొట్టాడని బలవంతంగా వాంగ్మూలం రాయించారు. వైసీపీ నేతల క్రూరత్వానికి ఇది స్పష్టమైన ఉదాహరణ” అని అన్నారు.
“ఈ విషయం మీద సీఎం చంద్రబాబు (Chandrababu), మంత్రి లోకేశ్ (Nara Lokesh) వెంటనే స్పందించి బాధితుడిని రక్షించారు. ప్రధాన నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. కానీ, ఈ దాడి వెనుక ఉన్న భూమన కరుణాకరరెడ్డి, అభినయ్ రెడ్డిని వదిలే ప్రసక్తే లేదు. కరుణాకరరెడ్డి చేసిన భూకబ్జాలు, అవినీతికి తగిన సాక్ష్యాలు ఉన్నాయి.
స్వర్ణముఖి నది పరిసరాల్లో 9 ఎకరాల భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు. నది గర్భాన్నే మింగిన భూరాక్షసుడివి నువ్వు. ఒకప్పుడు జిరాక్స్ దుకాణం నడిపిన భూమన, ఈరోజు వేల కోట్ల ఆస్తుల యజమాని ఎలా అయ్యారు? తితిదే ఛైర్మన్, తుడా ఛైర్మన్‌గా ఉన్న కాలంలో 21 ఆస్తులు మీ కుటుంబ సభ్యుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేశారు. ఆ సమయంలో ఆస్తులు కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి?” అని పట్టాభి ప్రశ్నించారు.