టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వన్డే భవిష్యత్తు కూడా సందేహాస్పదంగా మారింది. 2027 ప్రపంచకప్‌లో ఆడాలన్న వారి ఆశలకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఓ కీలక షరతు పెట్టినట్లు జాతీయ మీడియా కథనాలు ప్రచారం చేస్తున్నారు. వన్డే జట్టులో తమ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే, ఈ ఇద్దరూ తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ (విజయ్ హజారే ట్రోఫీ)లో పాల్గొనాల్సిన అవసరం ఉందని సెలక్టర్లు స్పష్టం చేశారు.
మార్గదర్శక సమాచారం ప్రకారం, ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే విజయ్ హజారే టోర్నమెంట్‌లో కోహ్లీ, రోహిత్ తప్పక పాల్గొనాలి. ఈ టోర్నీలో పాల్గోనకపోతే, నేరుగా భారత జట్టులో ఎంపికకు అవకాశం తక్కువేనని వార్తలు వస్తున్నాయి. టెస్టులు, టీ20లకు దూరంగా ఉండటంతో వారి మ్యాచ్ ప్రాక్టీస్ తగ్గడం, ఫిట్‌నెస్, ఫామ్‌పై నెగిటివ్ ప్రభావం పడుతుందని సెలక్టర్లు భావిస్తున్నారు.
ఇంకా, టీమ్ మేనేజ్‌మెంట్‌లో ఒక ముఖ్య నిపుణుడు "2027 ప్రపంచకప్ ప్రణాళికలో కోహ్లీ, రోహిత్ ఇద్దరూ లేరు" అని వెల్లడించారు. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాలని వారు ఆసక్తి చూపినప్పటికీ, ఎంపికకు అవకాశం లేకపోవడంతో వన్డే నుండి తప్పుకోవడమే మంచిదని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. మరోవైపు, శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా విజయం సాధించడం, యువ ఆటగాళ్లు జట్టులో మెరుగ్గా రాణించడం నేపథ్యంలో జట్టులో కొత్త మార్పులు రాబోతున్నాయని సెలక్షణ కమిటీ భావిస్తోంది. భవిష్యత్తులో గిల్‌ను అన్ని ఫార్మాట్ల కెప్టెన్‌గా నియమించాలనే ఆలోచన ఉంది.
ఈ పరిణామాలతో అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ కోహ్లీ, రోహిత్‌ల అంతర్జాతీయ వన్డే కెరీర్‌కు చివరి సిరీస్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో, ఈ ఇద్దరూ దేశవాళీ క్రికెట్‌కు తిరిగి రావడం కష్టమేనని భావిస్తున్నారు. టీ20, టెస్టుల్లో జరుగుతున్న తరం మార్పిడి వన్డేల్లోనూ కొనసాగుతుండడంతో, ఈ దిగ్గజాల భవిష్యత్తు అనిశ్చితిలో ఉంది.