ఆడుదాం ఆంధ్రా అవినీతి కేసులో విజిలెన్స్ విచారణ పూర్తయింది. త్వరలోనే నివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు. మాజీ మంత్రి రోజాపై కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో త్వరలోనే కేసు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.
వైసీపీ ప్రభుత్వ కాలంలో జరిగిన ఈ స్కామ్‌లో, కేవలం 47 రోజుల్లోనే రూ.125 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. దర్యాప్తులో, ఎక్కువగా వైసీపీ కార్యకర్తలనే విజేతలుగా ఎంపిక చేసినట్లు గుర్తించారు.
2023 డిసెంబర్‌లో ఘనంగా ప్రారంభించిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కంటే, పార్టీ ప్రచారానికే ఎక్కువగా ఉపయోగించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. పంపిన క్రీడా కిట్లు నాసిరకంగా ఉండటం, వాటిపై పార్టీ స్టిక్కర్లు అతికించడం, పబ్లిసిటీ కార్యక్రమాలకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం వంటి అంశాలు బయటపడ్డాయి.
కొత్త స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టే ముందు కీలక రికార్డులు డిలీట్ చేసినట్టు దర్యాప్తులో బయటపడింది. దీంతో ఆధారాలను నాశనం చేసే ప్రయత్నం జరిగిందనే అనుమానాలు మరింత బలపడ్డాయి.
ప్రస్తుతం విజిలెన్స్, సీఐడీ కమిటీలు రెండూ విచారణ జరుపుతున్నాయి. ఇప్పటికే పలు ఫిర్యాదులు కూటమి ప్రభుత్వానికి చేరాయి. గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ విషయంపై చర్చ జరిగింది. ఇప్పుడు రోజాకు చుట్టూ ఉచ్చు బిగుస్తోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.