ఉత్తరాఖండ్‌లో ఘోర విషాదం.. లోయలో పడిన బస్సు.. 8 మంది మృతి!

Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి సుమారు 100 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందగా, మరో 26 మంది గాయపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున తెహ్రీ గఢ్వాల్ జిల్లాలోని గులార్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.

Uttarakhand Bus Accident: 8 Dead, 26 Injured
Uttarakhand Bus Accident: 8 Dead, 26 Injured
  • ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గఢ్వాల్ జిల్లాలో బస్సు 100 మీటర్ల లోతైన లోయలో పడిపోవడంతో 8 మంది మృతి.
  • ఈ ప్రమాదంలో మరో 26 మంది గాయపడగా, SDRF, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి సుమారు 100 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందగా, మరో 26 మంది గాయపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున తెహ్రీ గఢ్వాల్ జిల్లాలోని గులార్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.

లోయలోకి దూసుకెళ్లిన బస్సు

హరిద్వార్ నుంచి చమోలీ వైపు వెళ్తున్న ప్రయాణికుల బస్సు గులార్ బ్రిడ్జి సమీపానికి చేరుకోగానే అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 నుంచి 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతిచెందారు.

రంగంలోకి SDRF బృందాలు

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF), పోలీసులు, స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లోయలో చిక్కుకున్న క్షతగాత్రులను స్ట్రెచర్ల సాయంతో రహదారిపైకి తీసుకొచ్చి అంబులెన్సుల్లో సమీప ఆసుపత్రులకు తరలించారు. మొత్తం 26 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

డ్రైవర్ అతివేగమే కారణమా?

ఈ ప్రమాదం నుంచి బయటపడిన ఓ ప్రయాణికుడు కీలక విషయాలు వెల్లడించాడు. బస్సు డ్రైవర్ అతివేగంతో వాహనాన్ని నడిపాడని, వేగం తగ్గించాలని తాము రెండు మూడు సార్లు కోరినా పట్టించుకోలేదని తెలిపాడు. తాను కొద్దిసేపు నిద్రలోకి జారుకున్న సమయంలో ప్రమాదం జరిగిందని, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ప్రమాదానికి అసలు కారణాలపై అధికారిక విచారణ జరగాల్సి ఉంది.

సీఎం ధామి దిగ్భ్రాంతి

ఈ ఘోర ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

Tags

Be the first to react

Latest