అనిరుధ్, కావ్య మారన్ 'సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్'! పెరియార్ కూతురుతోనే పెళ్లి?

అనిరుధ్, కావ్య మారన్ 'సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్'
అనిరుధ్, కావ్య మారన్ 'సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్'
  • 70 ఏళ్ల వయసులో 29 ఏళ్ల మణియమ్మైను పెరియార్ ఎందుకు వివాహం చేసుకున్నారు?
  • మణియమ్మై సొంత కూతురు కాదు – వ్యతిరేకుల దుష్ప్రచారాల వెనుక అసలు వాస్తవాలు!
  • 1949 నాటి చట్టాలు, ద్రవిడర్ కజగం ఆస్తుల రక్షణ కోసమే పెరియార్ రిజిస్టర్ మ్యారేజ్!

National: సంప్రదాయ, భక్తి భావాలు కలిగిన కుటుంబంలో జన్మించిన ఇ.వి. రామస్వామి (పెరియార్), తన యువ వయసులో కాశీకి వెళ్లినప్పుడు అక్కడి సత్రాల్లో ఎదురైన తీవ్రమైన కుల వివక్షను చూసి నాస్తికుడిగా మారారు. కులాలు, మతాలు, ఆచారాలను పక్కన పెట్టి, పురోహితుడు లేకుండా కేవలం ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో దండలు మార్చుకుని చేసుకునే 'సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్' (ఆత్మగౌరవ వివాహం) అనే విప్లవాత్మక పద్ధతిని ఆయన ప్రవేశపెట్టారు. ఇటీవల అనిరుధ్ – కావ్య మారన్ వివాహం మరియు కోయంబత్తూరు పెరియార్ లైబ్రరీ పుస్తకాల కొనుగోలు వివాదం నేపథ్యంలో పెరియార్ వ్యక్తిగత జీవితం మళ్లీ చర్చకు వచ్చింది.

మణియమ్మై సొంత కూతురు కాదు – దుష్ప్రచారాల వెనుక నిజం

తన 70వ ఏట పెరియార్ 29 ఏళ్ల మణియమ్మైను వివాహం చేసుకోవడం అప్పట్లో పెద్ద సంచలనమైంది. నిజానికి మణియమ్మై ఆయన సొంత కూతురు కాదు; ద్రవిడ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనే ఆమెను పెరియార్ ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారు, ఆమె కూడా తమిళ సంప్రదాయం ప్రకారం పెరియార్‌ను గౌరవంతో 'అయ్యా' అని పిలిచేవారు. అయితే వివాహం జరిగిన వెంటనే వ్యతిరేకులు ఆ పిలుపును అడ్డం పెట్టుకుని "సొంత కూతురినే పెళ్లి చేసుకున్నాడు" అంటూ తప్పుడు ప్రచారాలు సృష్టించారు.

1949 నాటి చట్టపరమైన చిక్కులు & ఆస్తుల రక్షణ కోసమే వివాహం!

సమాజం, సొంత పార్టీ నేతలు వ్యతిరేకిస్తారని తెలిసినా పెరియార్ ఆ నిర్ణయం తీసుకోవడానికి అప్పటి బ్రిటిష్ కాలం నాటి చట్టాలే ప్రధాన కారణం. 1949 నాటికి పెరియార్ ఆరోగ్యం బాగా క్షీణించింది; ఆ సమయానికి ఆయన నడుపుతున్న 'ద్రవిడర్ కజగం' (DK) సంస్థకు భారీగా ఆస్తులు ఉన్నాయి. పార్టీలోని అన్నాదురై వంటి సీనియర్ నేతలు ఎన్నికల్లో పోటీ చేయాలని భావించగా, ఎన్నికల రాజకీయాల్లోకి వెళితే ఉద్యమ ఆశయాలు అమ్ముడుపోతాయని పెరియార్ వ్యతిరేకించారు. ఆస్తులు రాజకీయ నేతల చేతుల్లోకి వెళ్లకుండా నమ్మకమైన మణియమ్మైకు చెందేలా చేయాలని ఆయన భావించారు.

దత్తతకు అవకాశం లేకపోవడం వల్లే రిజిస్టర్ మ్యారేజ్!

అప్పట్లో మణియమ్మైను దత్తత తీసుకోవచ్చు కదా అనే సందేహం రావచ్చు; కానీ భారతదేశంలో హిందూ దత్తత మరియు మనోవర్తి చట్టం 1956లో అమల్లోకి వచ్చింది. 1949 నాటి చట్టాల ప్రకారం పెరియార్ ఆమెను దత్తత తీసుకునే హక్కు లేదు, ఒకవేళ విల్లు రాసినా ఆయన తదనంతరం బంధువులు కోర్టులో సవాలు చేసే ప్రమాదం ఉంది. అందుకే న్యాయ నిపుణుల సలహా మేరకు చట్టబద్ధమైన వారసురాలిగా చేసేందుకు మణియమ్మైను రిజిస్టర్ వివాహం చేసుకున్నారు.

పార్టీ చీలిక, డీఎంకే ఆవిర్భావం & తమిళనాడు రాజకీయ చరిత్ర

ఎన్నికల్లో పోటీకి పెరియార్ నిరాకరించడం మరియు సీనియర్లను కాదని మణియమ్మైకు ప్రాధాన్యత ఇవ్వడంతోసి.ఎన్. అన్నాదురై సహా పలువురు నేతలు ద్రవిడర్ కజగం నుంచి బయటకు వచ్చి 'డీఎంకే' (DMK) పార్టీని స్థాపించారు. అయితే గురువు పెరియార్ మీద ఉన్న అపార గౌరవంతో డీఎంకే అధ్యక్ష కుర్చీని మాత్రం అన్నాదురై జీవితాంతం పెరియార్ కోసమే ఖాళీగా వదిలేశారు. ఆ వివాదం నుంచి పుట్టిన డీఎంకే గత 75 ఏళ్లుగా తమిళనాడు రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన పార్టీగా కొనసాగుతుండగా, నాస్తికుడైన పెరియార్ విగ్రహాలు నేటికీ తమిళనాడులోని అనేక ఆలయాల ముందు కనిపించడం విశేషం.

Tags

Be the first to react

Latest