పతంజలి ఘీ పై కొరడా! కోట్ల రూపాయల కల్తి ఆహార నిలువలు సీజ్! లైసెన్స్ రద్దు!

Maharashtra FDA Festive Drive: దీపావళి పండుగల సీజన్‌లో మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో ₹9.01 కోట్ల విలువైన 3.53 లక్షల కిలోల ఆహార పదార్థాలను సీజ్ చేశారు. ఛత్రపతి శంభాజీనగర్‌లో పతంజలి ఆయుర్వేద్ సూపర్ డిస్ట్రిబ్యూటర్ వద్ద ₹20.20 లక్షల విలువైన ఆవు నెయ్యిని జప్తు చేయడంతో పాటు, మొత్తం 19 వ్యాపార సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేశారు. భివండిలోని అవెన్యూ సూపర్‌మార్ట్స్‌లో 1.44 లక్షల కిలోల వంటనూనెను పట్టుకున్నారు. 13 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి 16 మందిని అరెస్ట్ చేశారు.

మహారాష్ట్ర ఎఫ్‌డీఏ మెగా దాడులు
మహారాష్ట్ర ఎఫ్‌డీఏ మెగా దాడులు
  • మహారాష్ట్ర వ్యాప్తంగా 7 డివిజన్లలో 114 దుకాణాల్లో 3.53 లక్షల కిలోల ఆహార పదార్థాలు స్వాధీనం!

  • థానే జిల్లా భివండిలోని అవెన్యూ సూపర్ మార్ట్స్ (డి-మార్ట్) వద్ద 1.44 లక్షల కేజీల వంటనూనె సీజ్!

  • తీవ్రమైన పరిశుభ్రత లోపాలు, ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు!

Maharashtra: దీపావళి పండుగ వేళ ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టింది. రాష్ట్రంలోని ఏడు డివిజన్ల పరిధిలో ఉన్న 114 వ్యాపార సంస్థలు, తయారీ యూనిట్లలో జరిపిన మెరుపు దాడుల్లో నాణ్యత లోపించిన, కల్తీ అనుమానాలున్న సుమారు 3.53 లక్షల కిలోల ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన ఈ నిల్వల మొత్తం మార్కెట్ విలువ దాదాపు ₹9.01 కోట్లుగా లెక్కించారు. ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని 19 వ్యాపార సంస్థల లైసెన్సులు మరియు రిజిస్ట్రేషన్లను రద్దు/సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

పతంజలి ఆవు నెయ్యి నిల్వలపై చర్యలు

ఈ తనిఖీల్లో పతంజలి ఆయుర్వేద్ సూపర్ డిస్ట్రిబ్యూటర్ అయిన మెసర్స్ దివ్య మహావితరక్ (ఛత్రపతి శంభాజీనగర్) వద్ద భారీగా నెయ్యి నిల్వలను సీజ్ చేశారు. తప్పుడు లేబులింగ్ (Misbranding), నాణ్యతా లోపాలు మరియు కల్తీ అనుమానాలపై మొత్తం 2,279.7 లీటర్ల (4,032 యూనిట్లు) పతంజలి గోవు నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ ₹20.20 లక్షలుగా ఉంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 నిబంధనలను ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు, ఆ డిస్ట్రిబ్యూటర్ లైసెన్స్‌ను సస్పెండ్ చేశారు.

పరిశుభ్రత లోపాలు – 19 సంస్థల లైసెన్సులు సస్పెన్షన్

ముంబై, అమరావతి, ఛత్రపతి శంభాజీనగర్ డివిజన్లలోని నమ్‌కీన్, స్వీట్లు, మసాలా దినుసులు తయారు చేసే 19 ప్రముఖ యూనిట్ల లైసెన్సులను ఎఫ్‌డీఏ సస్పెండ్ చేసింది. ఈ సంస్థలు అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని తయారు చేయడం, సరైన నిల్వ వసతులు లేకపోవడం, పెస్ట్ కంట్రోల్ (పురుగుల నివారణ) రికార్డులు పాటించకపోవడం, తప్పనిసరి డాక్యుమెంటేషన్ నిర్వహించకపోవడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించారు.

భారీగా వంటనూనె, నిత్యావసరాల జప్తు – అరెస్టులు

థానే జిల్లా భివండిలోని అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ (డీ-మార్ట్) గోదాము నుంచి ఏకంగా 1,44,218 కిలోల వంటనూనెను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే సతారాలోని అమీన్ ట్రేడర్స్ నుంచి 20,560 కిలోల బియ్యం, పప్పులు, బెల్లం నిల్వలను జప్తు చేశారు. పుణే డివిజన్ పరిధిలోని సతారా స్వాతి ఆయిల్ మిల్స్, సోలాపూర్ ఎస్.జి. ట్రేడర్స్ వద్ద కూడా వంటనూనెను సీజ్ చేశారు. నిషేధిత ఆహార పదార్థాల విక్రయాలకు సంబంధించి 13 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి, 16 మందిని అరెస్ట్ చేశారు. 7 వ్యాపార సంస్థలను సీజ్ చేయడంతో పాటు అక్రమ రవాణాకు వాడిన 6 వాహనాలను జప్తు చేశారు.

రెస్టారెంట్లపై నిఘా – ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలకు నోటీసులు

నాసిక్, శంభాజీనగర్, నాగ్‌పూర్ పరిధిలోని 34 హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాల్లో తనిఖీలు చేసి నిబంధనలు పాటించని 29 హోటళ్లకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు, 'టాటా 1ఎంజీ మెరైన్ కొల్లాజెన్ పౌడర్' తప్పుడు లేబులింగ్, వివాదాస్పద ప్రకటనల వ్యవహారంలో టాటా 1ఎంజీ హెల్త్‌కేర్, ఏసీఎఫ్‌వో ఫార్మాస్యూటికల్స్, అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ మరియు ఫ్లిప్‌కార్ట్ ఇండియా సంస్థలకు ఎఫ్‌ఎస్ఎస్ఏఐ (FSSAI) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 30 రోజుల్లోగా రాతపూర్వక వివరణ ఇవ్వాలని ఆ సంస్థలను ఆదేశించింది.

Tags

Be the first to react

Latest