తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు వరుసగా చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కర్నూలు, చేవెళ్ల ప్రాంతాల్లో జరిగిన ఘటనలు మరువకముందే, తాజాగా నల్గొండ జిల్లాలో మరొక ప్రమాదం సంభవించింది. చిట్యాల మండలం వెలిమినేడు శివారులో విహారి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. హైదరాబాద్ బీరంగూడ నుంచి నెల్లూరు జిల్లా కొండాపురం వైపు బయలుదేరిన NL 01 B 3250 నంబరు గల బస్సు, అర్ధరాత్రి సమయంలో నల్గొండ జిల్లా పరిధిలోని విజయవాడ జాతీయ రహదారిపైకి రాగానే ప్రమాదం జరిగింది. బస్సు ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే వాహనాన్ని పక్కకు ఆపాడు. కొన్ని క్షణాల్లోనే మంటలు బస్సు అంతా వ్యాపించాయి. ఆ సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే అందరూ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.
ఫైర్ సిబ్బందికి సమాచారం అందిన వెంటనే వారు అక్కడకు చేరుకుని రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయి బూడిదైంది. ప్రమాదానికి ముందు చౌటుప్పల్ శివారులో టీ బ్రేక్ కోసం డ్రైవర్ బస్సును ఆపినట్లు తెలిసింది. ప్రయాణికులు టీ తాగి తిరిగి బయలుదేరిన 10 నిమిషాలకే ఈ ఘటన జరిగింది. టీ బ్రేక్ కారణంగా ప్రయాణికులు నిద్రలోకి జారిపోకుండా మెలకువగా ఉండటం వల్లే పెద్ద ప్రాణనష్టం తప్పిందని తెలుస్తోంది. “టీ బ్రేక్ తీసుకోకపోయి ఉంటే తెల్లవారుజామున మేమంతా నిద్రలో ఉండేవాళ్లం... అప్పుడు పెద్ద ప్రమాదం జరిగి ఉండేది” అని ప్రయాణికులు చెబుతున్నారు.
ప్రయాణికులు ప్రాణాలతో బయటపడటానికి మరో కారణం బస్సు నాన్ ఏసీ కావడం. కిటికీలు తెరిచి ఉండటంతో, వెనుక డోర్ ఓపెన్ ఉండటంతో వారు వెంటనే బయటకు దూకగలిగారు. అయితే బస్సులో ఎలాంటి ఫైర్ సేఫ్టీ పరికరాలు లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వాహనాలకు సరైన ఫిట్‌నెస్ లేకుండా రోడ్లపై నడపడం వల్లే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని బాధితులు ఆరోపించారు. ప్రైవేట్ ట్రావెల్ యాజమాన్యాలు నిబంధనలను తేలిగ్గా తీసుకోవడం, వాహనాల సంరక్షణలో నిర్లక్ష్యం చూపడం వలన ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని వారు పేర్కొన్నారు.
ప్రమాదాలపై ప్రభుత్వం, రవాణాశాఖ మరింత కఠినంగా వ్యవహరించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ప్రైవేట్ బస్సులో తప్పనిసరిగా అగ్ని మాపక పరికరాలు ఏర్పాటు చేయాలని, వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేకుండా అనుమతులు ఇవ్వకూడదని సూచించారు. “తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ నెలా ఒక బస్సు దగ్ధమవుతోంది. కానీ అధికారులకు మాత్రం ఎటువంటి పట్టింపు లేదు. మేము కేవలం అదృష్టం వలన బతికాం” అని ఒక ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. వరుస ప్రమాదాలతో ప్రజల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో, ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్వరాలు పెరుగుతున్నాయి.