ప్రస్తుతం ఐటీ రంగంలో లేఆఫ్‌ల కలకలం నడుస్తున్న సమయంలో, ఓ కంపెనీ హెచ్‌ఆర్ విభాగం చేసిన చిన్న తప్పిదం పెద్ద గందరగోళానికి దారితీసింది. సంస్థలో కొత్త ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్‌ను పరీక్షిస్తున్న హెచ్‌ఆర్ టీమ్ పొరపాటున మొత్తం సిబ్బందికీ, అందులో సీఈఓ సహా 300 మందికి “మీ ఉద్యోగం రద్దు చేయబడింది” అనే ఈమెయిల్‌ను పంపింది. అకస్మాత్తుగా వచ్చిన ఈ మెయిల్ చూసి ఉద్యోగులు షాక్‌కు గురయ్యారు. కొందరు ఆందోళనకు గురవుతుండగా, మరికొందరు సరదా కామెంట్లతో ఆ పరిస్థితిని తేలికగా తీసుకున్నారు.
అసలు విషయం ఏంటంటే — ఆ కంపెనీ కొత్తగా రూపొందించిన ‘ఆఫ్‌బోర్డింగ్ ఆటోమేషన్ సిస్టమ్’ను పరీక్షిస్తోంది. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా ఉద్యోగుల రాజీనామా, ట్రాన్స్ఫర్ లేదా తొలగింపు ప్రక్రియలను ఆటోమేట్ చేయాలని యాజమాన్యం ప్రణాళిక వేసింది. అయితే టెస్టింగ్ సమయంలో సిస్టమ్‌ను “టెస్ట్ మోడ్” నుండి “లైవ్ మోడ్”కు మార్చిన హెచ్‌ఆర్ టీమ్, తిరిగి టెస్ట్ మోడ్‌కు మార్చడం మరిచిపోయింది. ఫలితంగా సిస్టమ్ ఆటోమేటిక్‌గా 300 మందికి ‘ఇది మీ చివరి పని దినం’ అంటూ మెయిల్స్ పంపింది.
ఆ మెయిల్ అందుకున్న ఉద్యోగుల్లో చాలా మంది ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరు తమ సీటు ఖాళీ చేయాలా, లేక నిజంగా తొలగించారా అనే సందేహంలో ఉన్నారు. ఒక మేనేజర్ సరదాగా “నా వస్తువులు సర్దుకోవడం మొదలుపెట్టాలా?” అని రిప్లై ఇచ్చారు. ఈ ఘటనను ఓ ఉద్యోగి రెడ్డిట్‌లో పోస్ట్ చేయడంతో, అది క్షణాల్లో వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఈ సంఘటన చర్చకు దారితీసింది. కొందరు “ఇంత సీరియస్ లేఆఫ్ సమయంలో ఇలాంటి జోక్ భయంకరంగా ఉంది” అంటుండగా, మరికొందరు మాత్రం “ఇలాంటి పొరపాటుతో నాకు మూడు నెలల పేమెంట్ వచ్చేదేమో” అంటూ నవ్వుకుంటున్నారు.
ఇంతలోనే ఐటీ, హెచ్‌ఆర్ విభాగాలు స్పష్టత ఇచ్చాయి. “ఎవరినీ ఉద్యోగం నుంచి తొలగించలేదు. ఇది సిస్టమ్ ఎర్రర్ మాత్రమే” అంటూ అత్యవసర మెయిల్ పంపించాయి. “మీ బ్యాడ్జ్‌లు ఇవ్వకండి, పని కొనసాగించండి” అని కూడా స్పష్టం చేశాయి. తమ పొరపాటును అంగీకరించిన హెచ్‌ఆర్ టీమ్ “టెస్ట్ సమయంలో లైవ్ మోడ్‌లోకి మారడం వల్ల ఈ ఘటన జరిగింది” అని వివరించింది. ఈ సంఘటనతో కంపెనీ అంతర్గత సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ, టెస్టింగ్ ప్రోటోకాల్‌లపై కొత్త చర్చ మొదలైంది. మొత్తానికి, హెచ్‌ఆర్ పొరపాటు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.