ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగం పునరుజ్జీవన దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర కూటమి ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా తీసుకుని ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 50 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) పార్కులను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పెడఈర్లపాడు నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ పార్కులు పరిశ్రమల విస్తరణతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి సృష్టికి దోహదం చేయనున్నాయి.
ఈ 50 పార్కులు మొత్తం 900 ఎకరాల విస్తీర్ణంలో రూ.810 కోట్ల భారీ పెట్టుబడులతో అభివృద్ధి చేయబడ్డాయి. వీటి ద్వారా సుమారు 12,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పరిశ్రమల శాఖ అధికారులు ఈ ప్రాజెక్టులను రాష్ట్ర పారిశ్రామిక పునరుజ్జీవనానికి దారితీసే కీలక దశగా పేర్కొన్నారు. స్థానిక స్థాయిలో పరిశ్రమల విస్తరణతో యువతకు కొత్త అవకాశాలు కలుగుతాయని, చిన్నస్థాయి వ్యాపార వేత్తలకు కొత్త ఉత్సాహం అందిస్తుందని పేర్కొన్నారు.
ఇక రెండో దశలో, 329 ఎకరాల్లో రూ.134 కోట్ల వ్యయంతో సిద్ధమైన 15 పారిశ్రామిక పార్కులను సీఎం ప్రారంభించనున్నారు. అదే సమయంలో 587 ఎకరాల విస్తీర్ణంలో కొత్తగా నిర్మించనున్న 32 ప్రభుత్వ ఎంఎస్ఎంఈ పార్కులు మరియు 3 ప్రైవేటు పార్కులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పార్కుల ద్వారా "ఒక కుటుంబం - ఒక పారిశ్రామికవేత్త" కార్యక్రమానికి మరింత బలాన్నిస్తుందని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచి, నైపుణ్యాలను ప్రోత్సహించడమే ఈ పార్కుల ప్రధాన లక్ష్యమని చెప్పారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే నిర్మాణం పూర్తిచేసుకున్న 28 కంపెనీల ఉత్పత్తి యూనిట్లను కూడా సీఎం ప్రారంభించనున్నారు. రూ.25,696 కోట్ల పెట్టుబడులతో స్థాపించబడిన ఈ సంస్థలు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో విస్తరించాయి. అనంతపురం, కాకినాడ, ప్రకాశం, కడప, శ్రీకాకుళం, విశాఖ, గుంటూరు, కర్నూలు వంటి జిల్లాలు ఈ అభివృద్ధి తాలూకు కేంద్రాలుగా మారనున్నాయి. ఇదే రోజు ఉదయం సీఎం కనిగిరిలో వర్చువల్ ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం, మధ్యాహ్నం అమరావతిలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశమవుతారు. సాయంత్రం ఆయన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో పాల్గొననున్నారు.