ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పర్యాటక రంగాన్ని వేగంగా అభివృద్ధి చేసే దిశగా కీలక అడుగులు వేస్తోంది. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా 2024–29 పర్యాటక విధానాన్ని అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం, ఈ ఏడాదిలోనే గణనీయమైన ఫలితాలు సాధిస్తోంది. కొత్త విధానం ప్రకటించిన ఏడాది లోపే రాష్ట్రవ్యాప్తంగా 27 కొత్త హోటళ్లకు అనుమతులు లభించగా, ఇప్పటికే మూడు హోటళ్లు కార్యకలాపాలు ప్రారంభించాయి. వచ్చే నెలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులతో కలిసి ఒకేసారి పది కొత్త హోటళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ కలెక్టర్ల సమావేశంలో వెల్లడించారు. పర్యాటకులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక కేంద్రాల్లో ఆధునిక హోటళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) విధానంలో హోటళ్ల నిర్మాణానికి అనువైన స్థలాలను జిల్లాల కలెక్టర్లు గుర్తించాలని సూచించింది. వివిధ ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న ఖాళీ భూములను సేకరించి, వాటి వివరాలను ప్రత్యేక వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. హోటళ్ల నిర్మాణంలో అనుభవం ఉన్న ప్రముఖ సంస్థలకు ఈ భూములను కేటాయించనున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం, బాపట్ల, సూర్యలంక, తిరుపతి వంటి పర్యాటక ప్రాంతాల్లో హోటళ్ల నిర్మాణానికి పలువురు ప్రముఖ పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నట్లు అధికారులు తెలిపారు.
పర్యాటకాన్ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం హోంస్టే విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించగా, జిల్లాల్లో ఎక్కువ మంది హోంస్టేలు ఏర్పాటు చేసేలా కలెక్టర్లు చొరవ చూపాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఏడు పర్యాటక హబ్‌లు, 25 టూరిజం సర్క్యూట్లను ప్రకటించారు. తొలి దశలో కొండపల్లి, మంగళగిరి, కూచిపూడి, ఏటికొప్పాక వంటి ప్రాంతాల్లో ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇవి స్థానిక కళలు, సంస్కృతి, సంప్రదాయాలను పర్యాటకులకు పరిచయం చేయనున్నాయి.
అడ్వంచర్ టూరిజం, హౌస్‌బోట్ ప్రాజెక్టులకు కూడా ప్రభుత్వం అనుమతులు ఇస్తోంది. విశాఖపట్నంలో 50 ఎకరాల్లో వండర్‌లా ఎమ్యూజ్‌మెంట్ పార్క్, తిరుపతిలో 20 ఎకరాల్లో ఇమాజికా వరల్డ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ రెండు భారీ ప్రాజెక్టుల ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. మరోవైపు, విశాఖలో ఇటీవల నిర్వహించిన సీఐఐ సదస్సులో పర్యాటక శాఖకు సంబంధించి రాష్ట్రంలోని 26 జిల్లాల్లో రూ.28,977 కోట్ల విలువైన 209 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఇవన్నీ అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం దేశంలోనే కీలక గమ్యస్థానంగా మారనుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.