అమెరికా వెళ్లాలనే కల నిజమైనప్పుడు, వీసా చేతికి రాగానే మనం చూసే మొదటి విషయం దాని ‘ఎక్స్‌పైరీ డేట్’ (Expiry Date). పదేళ్ల వీసా ఉంటే, పదేళ్ల వరకు ఎప్పుడైనా అమెరికా వెళ్లొచ్చని, అక్కడ ఉండొచ్చని చాలామంది భావిస్తారు. అయితే, ఇది చాలా పెద్ద పొరపాటని భారతదేశంలోని అమెరికా ఎంబసీ (US Embassy in India) మరోసారి స్పష్టం చేసింది. మీరు అమెరికాలో అడుగుపెట్టిన తర్వాత అక్కడ ఎంతకాలం ఉండొచ్చనేది మీ వీసా నిర్ణయించదు.. మరి ఏది నిర్ణయిస్తుందో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
సాధారణంగా అమెరికా వీసాపై గడువు తేదీని పేర్కొంటారు. అప్పటివరకు అగ్రరాజ్యంలో చట్టబద్ధంగా ఉండొచ్చని చాలా మంది అనుకుంటారు. అయితే, అది వాస్తవం కాదని వెల్లడించింది భారత్లోని అమెరికా ఎంబసీ (US Embassy in India). అమెరికాలో ఎంతకాలం ఉండొచ్చనే దానిపై మరోసారి స్పష్టతనిస్తూ.. తాజాగా తమ 'ఎక్స్' ఖాతాలో ఓ పోస్ట్ చేసింది.
"అంతర్జాతీయ పర్యాటకులు అమెరికాలో ఎంతకాలం ఉండొచ్చనేది వారి వీసా గడువు తేదీపై (Visa Expiry Date) ఆధారపడి ఉండదు. మీరు అగ్రరాజ్యంలోకి రాగానే.. కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ అధికారి దాన్ని నిర్ణయిస్తారు. మీరు ఎంతకాలం ఉండొచ్చనేది తెలుసుకోవాలంటే.. మీ 'ఐ-94’ పత్రంపై ఉండే ‘Admit Until Date' వివరాలను చెక్ చేసుకోవాలి” అని ఎంబసీ తమ పోస్ట్లో రాసుకొచ్చింది.
కాగా.. రెండు నెలల క్రితం కూడా అమెరికా (USA) దౌత్యకార్యాలయం ఇదే విధమైన సూచనలు చేసింది. వలసదారులు, విదేశీ పర్యాటకులపై ట్రంప్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోన్న నేపథ్యంలో ఎంబసీ ముందుజాగ్రత్తగా హెచ్చరికలు చేస్తోంది.
గతంలోనూ వీసా గడువు తేదీ దాటిన తర్వాత అగ్రరాజ్యంలో ఉంటే బహిష్కరణ ముప్పు తప్పదని హెచ్చరించిన సంగతి తెలిసిందే అమెరికా వెళ్లే చాలా మంది పర్యాటకులకు ఐ-94 పత్రం తప్పనిసరి.
అమెరికాలోకి ప్రవేశించగానే కస్టమ్స్ అధికారులు ఈ ఫారమ్పై పర్యాటకుల గడువు తేదీని నమోదు చేస్తారు. అప్పటివరకు మాత్రమే అగ్రరాజ్యంలో చట్టబద్ధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ తేదీ.. వీసాలపై ఉండే గడువు తేదీతో సరిపోలాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో వీసా గడువు తీరే తేదీ కన్నా ముందే ఐ-94 ఫారమ్లో చివరి తేదీ ఉంటుంది.
"వీసా ఉంది కదా!" అని ధీమాగా ఉండకుండా, ఐ-94 పత్రంలోని తేదీని గమనించడమే మీ ప్రయాణాన్ని సురక్షితం చేస్తుంది. అమెరికా ఎంబసీ మాటిమాటికీ హెచ్చరిస్తోందంటే, నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. చట్టబద్ధంగా ఉందాం.. ఇబ్బందులు పడకుండా ప్రయాణిద్దాం!