పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవికి మరోసారి పోలీస్ కస్టడీ విధిస్తూ నాంపల్లి జిల్లా కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే నమోదైన మూడు కేసుల్లో లోతైన విచారణ అవసరమని భావించిన కోర్టు, మొత్తం 12 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఒక్కో కేసుకు నాలుగు రోజుల చొప్పున రవిని ప్రశ్నించాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎల్లుండి నుంచి సైబర్ క్రైమ్ విభాగం రవిని కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టనుంది. ప్రస్తుతం రవి చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
ఈ కేసుకు సంబంధించి పోలీసు విచారణలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఐబొమ్మ రవి తన టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా హెచ్‌డీ సినిమాలను పైరసీ చేశానని విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రముఖ డిజిటల్ సినిమా డెలివరీ సంస్థ అయిన క్యూబ్ నెట్‌వర్క్‌కు సంబంధించిన శాటిలైట్ లింక్‌ను హ్యాక్ చేసి, థియేటర్లలో ప్రదర్శించబడుతున్న సినిమాలను హెచ్‌డీ ఫార్మాట్‌లో రికార్డ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఈ సినిమాలను ఆన్‌లైన్ లో అక్రమంగా విడుదల చేసినట్లు వెల్లడైంది.
పైరసీని వ్యవస్థీకృతంగా నిర్వహించేందుకు ‘హెచ్‌ఎ హబ్’ అనే పేరుతో ప్రత్యేకంగా టెలిగ్రామ్ ఛానల్‌ను క్రియేట్ చేసినట్లు సమాచారం. ఈ ఛానల్ ద్వారా కొత్తగా విడుదలైన సినిమాలను ముందుగానే అందుబాటులో ఉంచి, ఒక్కో సినిమాకు 100 డాలర్ల నుంచి 300 డాలర్ల వరకు వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దేశీయంగానే కాకుండా విదేశాల్లో ఉన్న యూజర్ల నుంచి కూడా డబ్బులు వసూలు చేసినట్లు ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం క్రిప్టో కరెన్సీతో పాటు ఇతర డిజిటల్ పేమెంట్ మార్గాలను ఉపయోగించినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఇప్పటికే హిట్, తండేల్, కిష్కింధపురి వంటి పలు తాజా సినిమాలను ఇదే విధానంలో పైరసీ చేసినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. ఈ సినిమాల విడుదలతో నిర్మాతలకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. థియేటర్లలో సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే హెచ్‌డీ ప్రింట్లు ఆన్‌లైన్ లో లీక్ కావడంతో సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిందని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.
సైబర్ క్రైమ్ పోలీసులు రవి వద్ద నుంచి ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లు, మొబైల్ ఫోన్లు, సర్వర్ యాక్సెస్ వివరాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. కస్టడీ విచారణలో ఈ డేటాను ఆధారంగా తీసుకుని అతనికి సహకరించిన ఇతర వ్యక్తులు, టెక్నికల్ నెట్‌వర్క్, విదేశీ లింకులు ఉన్నాయా అనే అంశాలపై దృష్టి సారించనున్నారు. అలాగే ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వహణకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ప్రకటనల ఆదాయం, డొమైన్ నిర్వహణ వివరాలపైనా లోతుగా విచారించనున్నారు.
ఈ కేసు తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. పైరసీపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్మాతలు, దర్శకులు డిమాండ్ చేస్తున్నారు. ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసు ద్వారాఆన్‌లైన్ పైరసీపై ఒక స్పష్టమైన సందేశం ఇవ్వాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.