ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ సరికొత్త ప్రణాళికలను అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రజలతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ఆధునిక సదుపాయాలను అందుబాటులోకి తెస్తోంది. ఈ క్రమంలో విజయవాడ బెర్మ్ పార్క్‌తో పాటు బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకులను ఆకర్షించేలా ఆల్ట్రా లగ్జరీ బోటు సేవలను ప్రారంభించేందుకు కీలక అడుగు వేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రైవేట్ బోటు ఆపరేటర్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) ప్రాథమిక అనుమతులు మంజూరు చేసింది.
ఈ ప్రాజెక్టులో భాగంగా విజయవాడ బెర్మ్ పార్క్, సూర్యలంక బీచ్ బ్యాక్ వాటర్ ప్రాంతాల్లో మొత్తం ఐదు జెట్టీలను నిర్మించనున్నారు. బోట్లకు అవసరమైన విద్యుత్ సదుపాయాలు, మౌలిక వసతులను ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అందించనుంది. ఐదు ఆల్ట్రా లగ్జరీ బోట్లకు సంబంధించిన డిజైన్ డ్రాయింగ్‌లకు ఇన్‌లాండ్ వాటర్‌వేస్ అథారిటీ నుంచి ప్రైవేట్ ఆపరేటర్లు అనుమతులు పొందిన అనంతరం నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ఈ విలాసవంతమైన బోటు సేవలను 2026 అక్టోబర్ నాటికి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. కేరళ తరహాలో నదులు, సముద్ర బ్యాక్ వాటర్‌లలో లగ్జరీ బోటు టూరిజాన్ని ఏపీలో అభివృద్ధి చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు.
ఇప్పటికే ఈ బోటు సేవల నిర్వహణపై ఆసక్తి ఉన్న సంస్థలను ప్రభుత్వం ఆహ్వానించింది. కేరళలో ఇలాంటి లగ్జరీ బోటు సేవలను విజయవంతంగా నిర్వహిస్తున్న ఒక సంస్థ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో సంస్థతో కలిసి ఉమ్మడి భాగస్వామ్యంతో ముందుకు వచ్చింది. వీరు విజయవాడ బెర్మ్ పార్క్ నుంచి పవిత్ర సంగమం వరకు రెండు లగ్జరీ బోట్లను నడిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ మార్గంలో దాదాపు 20 కిలోమీటర్ల మేర సర్వేను కూడా పూర్తి చేశారు. ఒక బోటులో ఐదు బెడ్రూంలతో పాటు 100 మంది పాల్గొనేలా కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేయనున్నారు. మరో బోటును 200 మంది డిన్నర్ చేసే విధంగా ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు. రాత్రి వేళల్లో భవానీ ద్వీపం వద్ద బోట్లను నిలిపేలా ప్రత్యేక జెట్టీతో పాటు విద్యుత్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.
ఇక బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ బ్యాక్ వాటర్‌లో మరో మూడు లగ్జరీ బోట్లను ప్రైవేట్ సంస్థలు నడపనున్నాయి. నాగరాజు కెనాల్ నుంచి నిజాంపట్నం వరకు ఈ బోట్లు రాకపోకలు సాగించనున్నాయి. ఇందులో ఒక బోటులో తొమ్మిది బెడ్రూంలు, మరో బోటులో మూడు బెడ్రూంలు, ఇంకొక బోటులో రెండు పడక గదులు ఏర్పాటు చేయనున్నారు. సూర్యలంక బ్యాక్ వాటర్‌లో సుమారు 30 కిలోమీటర్ల మేర పర్యాటకులు బోటు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. మార్గమధ్యంలో ప్రకృతి అందాలను ఆస్వాదించేలా ప్రత్యేక ప్రాంతాలను అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఇదే తరహాలో రాజమహేంద్రవరం–కాకినాడ గోదావరి నది పరిధి, నాగార్జునసాగర్, విశాఖ తీర ప్రాంతాల్లోనూ ఆల్ట్రా డీలక్స్ బోటు సేవలను ప్రారంభించేందుకు ఏపీ టూరిజం అభివృద్ధి సంస్థ ఫీజిబిలిటీ సర్వే నిర్వహిస్తోంది. సర్వే పూర్తయ్యాక ఆసక్తి చూపే సంస్థలను ఆహ్వానించనున్నారు.