Down Syndrome symptoms: పిల్లల ఎదుగుదలలో ప్రతి దశ ముఖ్యమైనదే, కానీ 'డౌన్ సిండ్రోమ్'తో జన్మించిన పిల్లల విషయంలో మొదటి ఐదు సంవత్సరాలు అత్యంత కీలకమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? చిన్న వయసులోనే చికిత్స ప్రారంభిస్తే ఎలాంటి మార్పులు వస్తాయి? అనే అంశాలు మీకోసం.
ఏంటి ఈ డౌన్ సిండ్రోమ్?
సాధారణంగా మనిషి శరీరంలోని ప్రతి కణంలో 46 క్రోమోజోములు ఉంటాయి. కానీ, కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల 21వ క్రోమోజోమ్ అదనంగా మొత్తం 47 ఏర్పడటాన్ని 'డౌన్ సిండ్రోమ్' అంటారు. దీనివల్ల పిల్లల శారీరక ఆకృతిలో మార్పులు రావడమే కాకుండా, మెదడు ఎదుగుదల కూడా కాస్త నెమ్మదిగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి వెయ్యి మందిలో ఒకరు ఈ సమస్యతో జన్మిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
మొదటి ఐదేళ్లు ఎందుకు 'గోల్డెన్ పీరియడ్'?
పిల్లల మెదడు మొదటి ఐదేళ్లలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. కోట్లాది నరాల అనుసంధానాలు ఈ సమయంలోనే జరుగుతాయి. డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లల్లో కండరాల పట్టు తక్కువగా ఉండటం వల్ల బోర్లా పడటం, కూర్చోవడం, నడవడం వంటివి ఆలస్యమవుతాయి. అందుకే ఈ 'విండో పీరియడ్'లో ఇచ్చే శిక్షణ వారి భవిష్యత్తును మారుస్తుంది.
ఎర్లీ ఇంటర్వెన్షన్' అంటే ఏమిటి?
పిల్లల్లో లోపాలను గుర్తించి వెంటనే అందించే చికిత్సనే 'ఎర్లీ ఇంటర్వెన్షన్' అంటారు. ఇందులో ప్రధానంగా మూడు రకాల థెరపీలు ఉంటాయి:
ఫిజియోథెరపీ: కండరాలకు బలాన్ని ఇచ్చి, పిల్లలు త్వరగా నడిచేలా చేస్తుంది.
స్పీచ్ థెరపీ: మాటలు రావడం ఆలస్యమైతే, సైగలు లేదా చిన్న చిన్న పదాల ద్వారా భావాలను పంచుకోవడం నేర్పిస్తారు.
ఆక్యుపేషనల్ థెరపీ: బ్రష్ చేసుకోవడం, అన్నం తినడం వంటి రోజువారీ పనులను సొంతంగా చేసుకునేలా శిక్షణ ఇస్తారు.
ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
ఈ పిల్లల్లో కేవలం ఎదుగుదల సమస్యలే కాకుండా.. గుండె సంబంధిత వ్యాధులు, వినికిడి లోపం, థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఎప్పటికప్పుడు డాక్టర్ల సలహాతో వైద్య పరీక్షలు చేయించడం ఎంతో అవసరం. సకాలంలో వైద్యం అందితే వారు కూడా అందరిలాగే ఆరోగ్యంగా ఉండగలరు.
మనవంతు బాధ్యత..
డౌన్ సిండ్రోమ్ అనేది జబ్బు కాదు, అది ఒక శారీరక స్థితి మాత్రమే. సరైన సమయంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం, నిపుణుల శిక్షణ ఉంటే ఈ పిల్లలు అద్భుతాలు సృష్టించగలరు. వారిని వివక్షతో చూడకుండా, ప్రేమతో ఆదరించినప్పుడే వారు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయగలరు.