Vitamin K Deficiency: మన ఆరోగ్యం విషయంలో విటమిన్ సి, విటమిన్ డి గురించి ఉన్నంత అవగాహన విటమిన్ 'కె' మీద ఉండదు. చాలామంది దీనిని పెద్దగా పట్టించుకోరు. కానీ, శరీరం సాఫీగా సాగాలన్నా, అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు నిలబడాలన్నా ఈ విటమిన్ అత్యంత కీలకం. రక్తం గడ్డకట్టడం నుంచి ఎముకల గట్టిదనం వరకు ఇది చేసే మేలు అంతా ఇంతా కాదు. మరి ఈ కీలక పోషకం మన శరీరంలో తగ్గిపోతే వచ్చే సంకేతాలు ఏంటి? నిపుణులు ఏం చెబుతున్నారు..
విటమిన్ 'కె' ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. ఆకుకూరల్లో లభించేది K1 అయితే, జంతు సంబంధిత ఆహారం పులియబెట్టిన పదార్థాల్లో దొరికేది K2. మనకు ఎక్కడైనా చిన్న గాయం అయినప్పుడు రక్తం వెంటనే గడ్డకట్టడానికి K1 సహాయపడుతుంది. ఒకవేళ ఇది లేకపోతే రక్తం ఆగకుండా కారిపోయి ప్రాణాపాయం కలగొచ్చు. ఇక K2 విషయానికి వస్తే, ఇది శరీరంలోని కాల్షియంను సరిగ్గా ఎముకలకు చేరవేస్తుంది. ఇది లేకపోతే కాల్షియం రక్త నాళాల్లో పేరుకుపోయి గుండె సమస్యలకు దారితీస్తుంది.
లోపం ఉందని చెప్పే ముఖ్య లక్షణాలు ఇవే..
ఆగని రక్తస్రావం: సాధారణంగా చిన్న దెబ్బ తగిలితే నిమిషాల్లో రక్తం ఆగిపోవాలి. కానీ విటమిన్ కె లోపం ఉంటే గడ్డకట్టే ప్రక్రియ ఆలస్యమవుతుంది. షేవింగ్ చేసుకున్నప్పుడు లేదా చిన్న కోత పడినా రక్తం ధారగా కారుతుంటే అది విటమిన్ లోపమే కావచ్చు.
చిగుళ్ల నుండి రక్తం కారడం: బ్రష్ చేస్తున్నప్పుడు లేదా గట్టిగా ఏదైనా తిన్నప్పుడు చిగుళ్ల నుండి రక్తం వస్తుంటే దానిని కేవలం పంటి సమస్యగా భావించకండి. రక్త నాళాలు బలహీనపడటం వల్ల కూడా ఇలా జరుగుతుంది. అలాగే ముక్కు నుండి అకస్మాత్తుగా రక్తం కారడం కూడా ఒక హెచ్చరికగా భావించాలి.
చర్మంపై నల్లటి మచ్చలు: శరీరానికి ఎక్కడైనా చిన్న తగిలినా వెంటనే ఆ ప్రాంతంలో చర్మం నీలం లేదా నలుపు రంగులోకి మారిపోతుంటే జాగ్రత్త పడాలి. లోపల రక్తనాళాలు చిట్లి రక్తం పేరుకుపోవడం వల్ల ఇలా జరుగుతుంది. దీనినే మనం 'కమిలిపోవడం' అంటాం.
ఎముకల బలహీనత: వయసుతో సంబంధం లేకుండా కీళ్ల నొప్పులు రావడం, చిన్నపాటి దెబ్బలకే ఎముకలు విరగడం వంటివి విటమిన్ కె-2 లోపానికి నిదర్శనం. కాల్షియం శరీరంలో ఉన్నా, దానిని ఎముకలు గ్రహించాలంటే ఈ విటమిన్ తోడుండాల్సిందే.
మహిళల్లో నెలసరి సమయంలో విపరీతమైన రక్తస్రావం కావడం, మలమూత్ర విసర్జనలో రక్తం చారలు కనిపించడం వంటివి జరిగితే వెంటనే అలర్ట్ కావాలి. ఇది శరీరంలో అంతర్గత రక్తస్రావానికి సంకేతం కావచ్చు. విటమిన్ 'కె' లోపాన్ని అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదు. మన ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది.
పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలను రోజూ డైట్‌లో చేర్చుకోవాలి. బ్రోకలీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటివి ఈ విటమిన్‌కు పెట్టింది పేరు. గుడ్లు, చేపలు, కాలేయం వంటి వాటిలో కూడా ఇది పుష్కలంగా ఉంటుంది. ఈ సమాచారం కేవలం మీ అవగాహనకు మాత్రమ ముందు మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.