ఉదయం నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదని కొంతమంది చెబుతారు. మరికొందరు మాత్రం ఆ అలవాటు వల్ల జీర్ణ సమస్యలు, గ్యాస్ లేదా ఆమ్లత్వం పెరుగుతాయని భావిస్తారు. ఈ రెండు అభిప్రాయాలు వినిపించడంతో ప్రజల్లో సందేహాలు సహజమే. అసలు ఖాళీ కడుపుతో పండ్లు తినాలా వద్దా అనేది శరీర పరిస్థితి, జీర్ణశక్తి మరియు అలవాటుపై ఆధారపడి ఉందని నిపుణులు చెబుతున్నారు.
పండ్లు ఎప్పుడైనా తినొచ్చు ఖాళీ కడుపుతో తిన్నా సమస్యేమీ ఉండదని, భోజనం తర్వాత లేదా మధ్యాహ్నం సమయంలో తిన్నా ఆరోగ్యానికి మంచిదే అని సూచిస్తున్నారు. పండ్లు సహజంగా నీరు, విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా కలిగి ఉంటాయి. అందువల్ల శరీరానికి తేలికగా జీర్ణమై శక్తిని అందిస్తాయి. నిద్రలేచిన తర్వాత శరీరం సహజంగా హైడ్రేషన్ కోసం ఎదురుచూస్తుంది, అప్పుడు పండ్లు తినడం శరీరానికి తేలికగా రిఫ్రెష్ గా అనిపిస్తుదట.
అయితే ప్రతి ఒక్కరికీ ఇదే అనుభవం ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఉదయాన్నే పండ్లు తింటే అజీర్ణం, ఆమ్లత్వం లేదా బ్లోటింగ్ వంటి సమస్యలు వచ్చే వ్యక్తులు కూడా ఉన్నారు. ముఖ్యంగా కమలా, అనాస, మోసంబి వంటి సిట్రస్ పండ్లు ఎక్కువ ఆమ్లత్వాన్ని కలిగి ఉండటంతో ఖాళీ కడుపులో తింటే కొందరికీ ఇబ్బంది కలగొచ్చు. అదే విధంగా జామ పెరుగు వంటి అధిక ఫైబర్ ఉన్న పండ్లు కొన్నిసార్లు జీర్ణ సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. .
ఆయుర్వేద నిపుణులు కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేస్తున్నారు. తీవ్రమైన ఆమ్లత్వం, జలుబు లేదా దగ్గు ఉన్నవారు ఉదయం సిట్రస్ పండ్లను తీసుకోకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ప్రతిరోజూ తేలికగా జీర్ణమయ్యే పండ్లను ఎంచుకోవడం మంచిదని వారు చెబుతున్నారు. పపయ్య, మెలన్స్, బనానా, బ్లూబెర్రీలు, ఆపిల్స్ వంటి పండ్లు ఉదయం జీర్ణమవ్వడానికి సౌకర్యంగా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు.
ఒకవేళ పండ్లు తిన్న తర్వాత ఎక్కువ ఆకలి వేస్తుంటే వేరుశెనగలు, బాదం లేదా పెరుగు వంటి ఆహారంతో కలిపి తినొచ్చు. పెద్దగా బ్రేక్‌ఫాస్ట్ తీసుకునే అలవాటు ఉన్నవారు పండ్లు రెండు భోజనాల మధ్యలో కూడా తీసుకోవచ్చు. నిపుణులు చెబుతున్నది ఒక్కటే పండ్లు ఆరోగ్యానికి మంచివి, కానీ వాటి సమయం శరీరం ఎలా స్పందిస్తుందో దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఈ సమాచారం కేవలం మీ అవగాహనకు మాత్రమే మీ ఆరోగ్యరీత్యా ముందుగా మీ డాక్టర్ సూచనల మేరకు తీసుకోవడం మంచిది.