Trump: ఈ వీకెండ్లోనే ఇరాన్‌పై అమెరికా అటాక్? CNN సంచలన రిపోర్ట్
మిడిల్ ఈస్ట్‌లో భారీగా US ఎయిర్ పవర్ మోహరింపు
ఇరాన్ అణు కేంద్రాలే టార్గెట్.. యుద్ధ వాతావరణం తీవ్రం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల కోసం వేచి చూస్తూ ఇరాన్‌పై (Iran) సైనిక చర్యలకు అమెరికా ఆర్మీ సిద్ధంగా ఉందన్న వార్తలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ CNN వెల్లడించిన వివరాల ప్రకారం, మధ్యప్రాచ్య ప్రాంతంలో అమెరికా భారీ స్థాయిలో సైనిక శక్తిని ఇప్పటికే మోహరించినట్లు సమాచారం. 2003లో జరిగిన ఇరాక్ యుద్ధం తర్వాత ఇదే అతిపెద్ద ఎయిర్ పవర్ మొహరింపు అని విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధ విమానాలు, స్టెల్త్ బాంబర్లు, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు, క్షిపణి వ్యవస్థలు వంటి కీలక రక్షణ వనరులు ఇప్పటికే వ్యూహాత్మక ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది.
ఇటీవల ఇరాన్ అణు కార్యక్రమాలపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఇరాన్ అణు కేంద్రాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయనే అనుమానాల నేపథ్యంలో అమెరికా భద్రతా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో ట్రంప్ తన రక్షణ, విదేశాంగ మరియు జాతీయ భద్రతా సలహాదారులతో అత్యవసర సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఆ సమావేశంలో ఇరాన్‌పై పరిమిత వైమానిక దాడులు చేయడం, అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం వంటి ఆప్షన్లు చర్చించినట్లు అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఇప్పటికే తీవ్రంగా ఉండగా, అమెరికా సైనిక కదలికలు ప్రపంచ దేశాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా దాడి జరిగితే ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే అంతర్జాతీయ చమురు సరఫరాపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. దీంతో గ్లోబల్ మార్కెట్లలో ఆయిల్ ధరలు పెరిగే అవకాశమూ ఉందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.
అమెరికా అధికార వర్గాలు అధికారికంగా దాడిపై స్పష్టమైన ప్రకటన చేయకపోయినా, సైనిక సిద్ధత మాత్రం అత్యున్నత స్థాయిలో కొనసాగుతోందని సమాచారం. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ వీకెండ్‌లోనే దాడులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే దౌత్యపరమైన మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించాలని యూరప్ దేశాలు, ఐక్యరాజ్యసమితి పిలుపునిస్తున్నాయి.
ఈ పరిస్థితి యుద్ధానికి దారితీస్తుందా? లేక చివరి నిమిషంలో చర్చల ద్వారానే ఉద్రిక్తతలు తగ్గుతాయా? అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా మారింది. అమెరికా–ఇరాన్ సంబంధాలు మరోసారి సంక్షోభ దశలోకి వెళ్లే అవకాశముందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ సైనిక చర్యలు ప్రారంభమైతే అది ప్రాంతీయ ఘర్షణకే కాకుండా ప్రపంచ భద్రతా పరిస్థితులపై కూడా దీర్ఘకాల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.