దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికులకు భారీ శుభవార్తను ప్రకటించింది. పండుగ సీజన్, సంవత్సరాంతం రద్దీ దృష్ట్యా అత్యధిక ట్రాఫిక్ ఉన్న మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ముఖ్యంగా హైదరాబాద్–తిరుపతి మార్గంలో ప్రతివారం ప్రయాణించే వేలాది మంది భక్తులు, ఉద్యోగులు, విద్యార్థులు ఈ రైళ్ల ద్వారా భారీగా లాభపడనున్నారు. తిరుపతి నుంచి చర్లపల్లి, చర్లపల్లి నుంచి తిరుపతి, అలాగే పంధర్‌పూర్ నుంచి తిరుపతి దాకా మొత్తం మూడు ప్రత్యేక రైళ్లను తాత్కాలికంగా నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రాబోయే రోజుల్లో రద్దీ మరింత పెరుగుతుందని అంచనా వేసి, ప్రయాణికుల ఒత్తిడిని తగ్గించేందుకు తీసుకున్న కీలక నిర్ణయమిది.
మొదటి ప్రత్యేక రైలు 07000 నంబరు గల తిరుపతి – చర్లపల్లి సూపర్‌ఫాస్ట్ స్పెషల్. ఈ రైలు మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు చర్లపల్లికి చేరుతుంది. ఈ సేవలు 16 డిసెంబర్ 2025 నుంచి 30 డిసెంబర్ 2025 వరకు కొనసాగనున్నాయి. రెండో రైలు 07031 నంబర్‌తో చర్లపల్లి – తిరుపతి రూట్‌లో శుక్రవారం నడుస్తుంది. ఈ రైలు మద్యాహ్నం 3.35 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి, తదుపరి రోజు ఉదయం 6.40 గంటలకు తిరుపతికి చేరుతుంది. ఇది 19 డిసెంబర్ 2025 నుంచి 2 జనవరి 2026 వరకు అందుబాటులో ఉంటుంది. మూడో ప్రత్యేక రైలు 07032 నంబరుతో పంధర్‌పూర్ – తిరుపతి మార్గంలో ఆదివారం నడవనుంది. ఈ రైలు రాత్రి 8 గంటలకు పంధర్‌పూర్ నుంచి బయలుదేరి, రెండో రోజు రాత్రి 10.30 గంటలకు తిరుపతికి చేరుతుంది. డిసెంబర్ 21, 2025 నుంచి జనవరి 4, 2026 వరకు ఈ రైలు నడుస్తుంది.
ప్రతి రైలు తన ప్రయాణ మార్గంలో పలు కీలక స్టేషన్లలో ఆగనుంది. 07000 నంబర్ తిరుపతి–చర్లపల్లి ప్రత్యేక రైళ్లు రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, నంద్యాల, గిద్దలూరు, కుంబం, మార్కాపూర్ రోడ్, దొనకొండ, వినుకొండ, రొంపిచెర్ల, మిర్యాలగూడ, నల్గొండ వంటి స్టేషన్లలో ఆగుతుంది. ఇలాగే 07031 చర్లపల్లి–తిరుపతి ట్రైన్ మల్కాజిగిరి, కాచిగూడ, షాద్‌నగర్, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, గూటి, తాడిపత్రి, కడప తదితర స్టేషన్లలో హాల్ట్ చేస్తుంది. పంధర్‌పూర్–తిరుపతి 07032 రైలు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ స్టేషన్లు—లాతూర్, భాల్కీ, బీదర్, జహీరాబాద్, వికారాబాద్, సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట—వంటి చోట్ల ఆగుతుంది.
ఈ ప్రత్యేక రైళ్లు రద్దీ సమయంలో ప్రయాణికులకు పెద్ద ఊరటనిస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. సాధారణ రోజుల్లో రిజర్వేషన్ దొరకడం కష్టమవుతుండగా, ఈ తాత్కాలిక రైళ్లు ప్రయాణ భారం తగ్గించనున్నాయి. ముఖ్యంగా తిరుమలకు వెళ్లే భక్తులకు, కుటుంబాలతో ప్రయాణించే వారికి, ప్రతి వారం హైదరాబాద్–తిరుపతి రూట్‌లో తిరిగే ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. పండుగ రోజుల్లో ప్రయాణికుల సౌకర్యానికే ముఖ్య ప్రాధాన్యత ఇచ్చి, అదనపు సౌకర్యాలతో ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు SCR స్పష్టంచేసింది.