అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు ఆసక్తి చూపే భారతీయులందరిలో హెచ్-1బీ వీసా అత్యంత కీలకమైనది. అయితే తాజాగా ఈ వీసాకు సంబంధించిన ప్రక్రియలో అనూహ్య మార్పులు చోటుచేసుకోవడంతో దరఖాస్తుదారులు భారీగా ఇబ్బందులు పడుతున్నారు. అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త సోషల్ మీడియా వెరిఫికేషన్ విధానం ప్రభావంతో భారత్‌లో వేలాది వీసా అపాయింట్‌మెంట్లు ఒక్కసారిగా వాయిదా పడ్డాయి. డిసెంబర్ మధ్య నుంచి చివరి వారంలో జరగాల్సిన ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది మార్చి నెలకు మార్చినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. దీని వల్ల అమెరికా వెళ్లాలనుకునే ఉద్యోగ అభ్యర్థులు కొత్త తేదీల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది.
భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం రాత్రి దరఖాస్తుదారులకు కీలక సూచనలు జారీ చేసింది. అపాయింట్‌మెంట్ రీషెడ్యూల్ అయినట్లు ఈమెయిల్ అందినవారు తప్పనిసరిగా కొత్త తేదీల్లోనే హాజరు కావాలని స్పష్టం చేసింది. పాత తేదీల్లో కాన్సులేట్‌కి వచ్చేవారిని అనుమతించబోమని కఠినంగా హెచ్చరించింది. ఇప్పటికే హైదరాబాదు, చెన్నై, ముంబై, న్యూ ఢిల్లీ, కోల్‌కతా కాన్సులేట్లలో పెద్ద ఎత్తున అపాయింట్‌మెంట్లు మార్చబడినట్లు తెలుస్తోంది. ఈ ఆకస్మిక మార్పులతో వేలాది మంది ఉద్యోగులు తమ ప్లాన్లను, ప్రయాణ ఏర్పాట్లను మళ్లీ రీషెడ్యూల్ చేసుకోవాల్సి వచ్చింది.
కొత్తగా అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం హెచ్-1బీ, హెచ్-4 వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఖాతాల ప్రైవసీ సెట్టింగ్‌లను ‘పబ్లిక్’ చేయాల్సి ఉంటుంది. అధికారులుఈ నెల 15 నుంచి దరఖాస్తుదారుల డిజిటల్ కార్యకలాపాలు, పబ్లిక్ పోస్టులు, అనుసరించే పేజీలు, కమ్యూనికేషన్ ప్యాటర్న్‌లను సమీక్షిస్తారు. జాతీయ భద్రతకు ప్రమాదకరంగా భావించే వ్యక్తులను ముందుగానే గుర్తించడమే ఈ చర్యల లక్ష్యంగా అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. “ప్రతి వీసా మంజూరే ఒక జాతీయ భద్రతా నిర్ణయం” అన్న విదేశాంగ శాఖ వ్యాఖ్యలతో ఈ మార్పులు ఎంత కఠినమో స్పష్టమవుతోంది. దీంతో సోషల్ మీడియా పారదర్శకత ఇప్పుడు వీసా అర్హతలో కీలక ప్రమాణంగా మారింది.
ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌పై నియంత్రణలు వరుసగా పెరుగుతున్నాయి. నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులు అమెరికాలో పనిచేసే ప్రధాన మార్గంగా ఉండే ఈ వీసాపై గతంలోనే పలు ఆంక్షలు విధించారు. ఒక్కో వీసాపై 100,000 డాలర్ల అదనపు రుసుము విధించడం, 19 దేశాల నుంచి గ్రీన్‌కార్డ్ దరఖాస్తులను తాత్కాలికంగా నిలిపివేయడం వంటి నిర్ణయాలు ఉద్యోగులకు పెద్ద దెబ్బగా నిలిచాయి. తాజా సోషల్ మీడియా తనిఖీలు కూడా ఈ కఠిన విధానాల కొనసాగింపుగానే కనిపిస్తున్నాయి. దీంతో అమెరికాలో కెరీర్ నిర్మించాలనుకునే భారతీయ యువత ఇప్పుడు మరింత జాగ్రత్తగా వీసా ప్రాసెస్‌కు సిద్ధం కావాల్సిన పరిస్థతి ఏర్పడింది.