శ్రీలంకలో వర్షాలు, వరదలు వలన పరిస్థితులు రోజురోజుకూ విషమిస్తున్నాయి. డిట్‌వా తుఫాన్ ప్రభావంతో దాదాపు వారం రోజులుగా కొనసాగుతున్న భారీ వర్షాలకు ఇప్పటికే 132 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగినది. మరో 176 మంది కనిపించకుండా పోయినట్లు అధికారికంగా నిర్ధారించడంతో ఆ దేశం అంతటా ఆందోళన నెలకొంది. దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ విపత్తు నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించి అంతర్జాతీయ సహాయం కోరింది.
డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెంటర్ వెల్లడించిన వివరాల ప్రకారం, 15,000కిపైగా ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సురక్షిత ప్రదేశాలకు తరలించబడిన వారు మాత్రమే 78,000 మందికి చేరుకున్నారు. విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో దేశంలోని సుమారు మూడోవంతు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నీటి శుద్ధి కేంద్రాల్లోకి వరదనీరు చేరడంతో తాగునీటి కొరత మరింత తీవ్రమైంది. అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు కూడా దెబ్బతిన్నాయి.
అత్యవసర చట్టాలను అమల్లోకి తెచ్చిన అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే, సైన్యం, నౌకాదళం, వైమానిక దళాన్ని పూర్తి స్థాయిలో రక్షణ చర్యలకు వినియోగించాలని ఆదేశించారు. అనురాధపురం జిల్లాలో చిక్కుకుపోయిన 69 మంది బస్సు ప్రయాణికులను రక్షించేందుకు సైన్యం 24 గంటలపాటు సాగిన ఆపరేషన్ నిర్వహించింది. హెలికాప్టర్‌తో ప్రయత్నించగా గాలివాన కారణంగా మొదటి ప్రయత్నం విఫలమైనప్పటికీ, చివరకు నౌకాదళ పడవల సాయంతో వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
బదుల్లా, కాండీ వంటి మధ్య ప్రాంతాలు పూర్తిగా వరద ముంపులో చిక్కుకుపోయాయి. నేలచరియలతో రహదారులు తెగిపోవడం వల్ల పలు గ్రామాలు బయట ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. మస్పన్న గ్రామానికి చెందిన స్థానికుడు సమన్ కుమార మాట్లాడుతూ గ్రామం మొత్తం నీటిలో మునిగిపోయింది. బయటకు వెళ్లే దారి లేదు. శుద్ధ నీరు కూడా దొరకడం లేదు అని ఆవేదనను వ్యక్తపరిచారు.
ఇదిలా ఉంటే తుఫాన్ నేటికీ (శనివారం) శ్రీలంకను దాటి ఉత్తర దిశగా కదిలి భారత్ వైపు సాగుతోంది. చెన్నైలో ముందస్తు హెచ్చరికలతో 54 విమానాల రద్దు, పలు ప్రాంతాల్లో పాఠశాలలు మూసివేత వంటి చర్యలు తీసుకున్నారు.
శ్రీలంక కోరిన అత్యవసర సహాయానికి భారత్ తొలుత స్పందించింది. కోలంబోలో ఉన్న భారత నౌకాదళ నౌక తన వద్ద ఉన్న రేషన్‌ను వరద బాధితులకు అందించగా, రెండు విమానాల నిండా సహాయక సామగ్రిని భారత్ పంపింది. ప్రధాని నరేంద్ర మోదీ సానుభూతి వ్యక్తం చేస్తూ అవసరమైతే ఇంకా సహాయం అందించేందుకు సిద్ధమని ప్రకటించారు.
డిట్‌వా తుఫాన్ ప్రభావం 2017 తర్వాత శ్రీలంక ఎదుర్కొంటున్న అత్యంత భారీ ప్రకృతి విపత్తుగా నమోదైంది. అప్పట్లో వరదలు, భూకంపాలు 200 మందికి పైగా ప్రాణాలు తీసిన విషయం ఇంకా ప్రజల మదిలో ఉంది. ఇప్పుడు అదే భయంకర దృశ్యాలు తిరిగి ఉత్పన్నమవుతున్నాయి. వర్షాలు కాస్త తగ్గినప్పటికీ, ఇంకా ఉత్తర ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా స్థిరపడలేదు. అధికార యంత్రాంగం సహాయక చర్యలు వేగవంతం చేస్తుండగా దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర అస్థిరత, అనిశ్చితిలో ఉన్నారు.