భారత్‌లో వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్‌చాట్, షేర్‌చాట్, జియోచాట్, అరట్టై వంటి ప్రధాన మెసేజింగ్ యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం కొత్త భద్రతా నిబంధనలు విధించింది. ఇకపై ఫోన్‌లో యాక్టివ్ సిమ్ లేకుంటే ఈ యాప్‌లు పని చేయకుండా చూడాలని కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. సైబర్ మోసాలను అరికట్టే ఉద్దేశంతో తీసుకొచ్చిన టెలికమ్యూనికేషన్ సైబర్ సెక్యూరిటీ సవరణ నిబంధనలు – 2025లో ఇవి భాగం.
కొత్త నియమాల ప్రకారం, మెసేజింగ్ యాప్‌లు వినియోగదారుడి యాక్టివ్ సిమ్ కార్డ్‌తో ఎప్పటికప్పుడు అనుసంధానమై ఉండాలి. అలాగే కంప్యూటర్ బ్రౌజర్ ద్వారా లాగిన్ అయ్యే వారిని ప్రతి 6 గంటలకు ఆటోమేటిక్‌గా లాగౌట్ చేయాలి. మళ్లీ యాప్‌లోకి రావాలంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తిరిగి ధ్రువీకరణ చేసుకోవాలి. దీంతో యూజర్ సెషన్ పూర్తిగా వారి సిమ్‌కు ముడిపడి ఉండి, దుర్వినియోగానికి వీలుకావడం తగ్గుతుంది.
ఈ మార్పుల ప్రధాన కారణం ప్రస్తుతం యాప్‌లో ఒకసారి మొబైల్ నంబర్ వేరిఫై చేస్తే చాలు, ఆ తరువాత సిమ్ తీయినా యాప్ పనిచేయడం. ఈ లొసుగును నేరగాళ్లు విదేశాల నుంచి కూడా ఉపయోగించి పెద్ద ఎత్తున మోసాలు చేస్తున్నారని ప్రభుత్వం తెలిపింది. సిమ్ బైండింగ్ వల్ల యూజర్—నంబర్—డివైజ్ మధ్య నేరుగా సంబంధం ఉండటంతో దుష్టచర్యలను గుర్తించడం సులభమవుతుందని COAI కూడా పేర్కొంది.
ఇప్పటికే బ్యాంకింగ్, యూపీఐ వంటి ఫైనాన్స్ యాప్‌లలో ఈ తరహా సిమ్ బైండింగ్ విధానం అమల్లో ఉంది. మెసేజింగ్ యాప్‌ల్లో కూడా ఇది తప్పనిసరి చేస్తే భద్రత మరింత మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిబంధనలను అమలు చేయడానికి యాప్ కంపెనీలకు 90 రోజుల గడువు ఇచ్చారు.
అయితే నూతన నియమాలపై నిపుణుల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. కొందరు దీని వల్ల సైబర్ మోసాలు తగ్గవచ్చని భావిస్తుండగా, నకిలీ ఐడీలతో కొత్త సిమ్‌లు పొందడం నేరగాళ్లకు పెద్ద సమస్య కాదని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా, ఈ మార్పుల వలన సాధారణ యూజర్లు కొంత అసౌకర్యాన్ని ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉంది.