Boiled Vegetables: ప్రస్తుత కాలం కూరగాయలను పచ్చిగా తింటేనే అందులోని విటమిన్లు, పోషకాలు నేరుగా శరీరానికి అందుతాయని చాలా మంది భావిస్తుంటారు. నిజానికి ఉడకపెట్టిన కూరగాయలు, దుంపలు, కిడ్నీ బీన్స్, సెనగలు వంటి వాటిని నూనెలో వేపకుండా ఉడకపెట్టి తింటేనే ఆరోగ్యనికి ఎంతో మేలు అతి ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారు ఉదయాన్నే టిఫిన్ గా వీటిని తీసుకోవడం ద్వారా అదనపు కొవ్వు చేరకుండా వారు బరువు నియంత్రణ చేసుకోవచ్చు.
కొన్ని రకాల కూరగాయలను పచ్చిగా తినడం కంటే, వాటిని కాస్త ఉడికించి తింటేనే మన శరీరానికి ఎక్కువ మేలు జరుగుతుంది. వండటం వల్ల కొన్ని కూరగాయల్లోని పోషక విలువలు మరింత పెరుగుతాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. మన వంటింట్లో నిత్యం కనిపించే క్యారెట్, టమాటో వంటి వాటిని ఉడికించినప్పుడు వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి సులభంగా గ్రహించే స్థితిలోకి మారతాయి.
టమాటోను వేడి చేసినప్పుడు అందులోని 'లైకోపీన్' అనే అంశం విడుదలవుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాకుండా, క్యాన్సర్ వంటి వ్యాధుల బారి నుండి మనల్ని రక్షిస్తుంది. అలాగే క్యారెట్‌ను ఉడికించి తినడం వల్ల అందులోని బీటా కెరోటిన్ విటమిన్-ఏగా మారి కంటి చూపును మెరుగుపరుస్తుంది.
ఇక ఆకుకూరల విషయానికి వస్తే, పాలకూరను పచ్చిగా కాకుండా కొద్దిగా ఉడికించి తీసుకోవడం ఉత్తమం. పాలకూరలో ఉండే ఆక్సాలిక్ ఆమ్లం పచ్చిగా ఉన్నప్పుడు మన శరీరం ఐరన్, కాల్షియంను గ్రహించకుండా అడ్డుకుంటుంది. వండటం వల్ల ఈ ఆమ్లం తగ్గి, పోషకాలు మన శరీరానికి పూర్తిస్థాయిలో అందుతాయి. అదేవిధంగా బ్రోకలీ, బీట్‌రూట్ వంటి కూరగాయలను కూడా ఆవిరిపై ఉడికించి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ముఖ్యంగా బ్రోకలీని పచ్చిగా తింటే థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి ఉడికించడమే సరైన పద్ధతి.
దుంప జాతికి చెందిన బంగాళదుంప, చిలగడదుంపలను అస్సలు పచ్చిగా తినకూడదు. వీటిని ఉడికించడం వల్ల వాటిలోని స్టార్చ్ మెత్తబడి జీర్ణం కావడం సులభం అవుతుంది. బంగాళదుంపను ఉడికించి తినడం వల్ల విటమిన్-సి, బి6 వంటి పోషకాలు శరీరానికి అందుతాయి. వీటిని వండటం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా నియంత్రణలో ఉంటుంది, ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. చిలగడదుంపలోని పోషకాలు చర్మ సౌందర్యానికి, రోగనిరోధక శక్తి పెంచడానికి ఎంతో తోడ్పడతాయి.