భారత రైల్వే శాఖ శుక్రవారం ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంది. ఇండిగో ఎయిర్‌లైన్‌లో ఏర్పడిన సమస్యల వల్ల దేశంలో పలు విమానాలు రద్దు అవుతున్నాయి. దీనితో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రైలు ప్రయాణానికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రయాణికుల సౌకర్యం కోసం రైల్వే శాఖ మొత్తం 37 ప్రీమియం రైళ్లలో 116 కోచ్‌లను అదనంగా జోడించేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుంది విమానాల సమస్య పరిష్కరించే వరకు కొనసాగనుంది.
అధికారుల సమాచారం ప్రకారం అదనపు కోచ్‌లు పెట్టబడుతున్న రైళ్లు న్యూ ఢిల్లీ, ముంబై, లక్నో, జమ్మూ తావి, పట్నా, హౌరా, చెన్నై వంటి ప్రధాన నగరాల నుంచి ప్రారంభమవుతాయి. ఈ రైళ్లు పెద్ద నగరాలు, చిన్న పట్టణాలను కలుపుతున్నాయి. దీంతో విమానాలు ఎక్కలేకపోతున్న అనేక మంది ప్రయాణికులకు రైల్వే తక్షణ ప్రత్యామ్నాయం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణ ఒత్తిడి పెరిగిన ప్రాంతాలు, మార్గాలను పరిశీలించి కోచ్‌ల సంఖ్యను పెంచుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు.
ఇంతకుముందు ఉత్తర రైల్వే ఇప్పటికే కొన్ని ప్రముఖ రైళ్లలో అదనపు కోచ్‌లను జత చేసింది. జమ్మూ రాజధాని ఎక్స్‌ప్రెస్ (12425/26) మరియు దిబ్రుగఢ్ రాజధాని ఎక్స్‌ప్రెస్ (12423/24) రైళ్లలో ప్రతి ఒక్కదానికీ ఒక 3AC కోచ్ చేర్చారు. అలాగే చండీగఢ్ శతాబ్దీ ఎక్స్‌ప్రెస్ (12045/46) మరియు అమృత్‌సర్ శతాబ్దీ ఎక్స్‌ప్రెస్ (12029/30) రైళ్లలో ఒక్కో ఏసీ చెయిర్ కార్ కోచ్‌ను జోడించారు. ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాంశు శేఖర్ ఉపాధ్యాయ్ ఈ వివరాలను వెల్లడించారు.
ప్రయాణికుల డిమాండ్ మరింత పెరుగుతుందనే అంచనాతో రైల్వే శాఖ అవసరమైతే మరిన్ని రైళ్లలో కోచ్‌ల సంఖ్యను పెంచడానికి సిద్ధంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. పరిస్థితి క్షీణిస్తే, పూర్తిగా ఎయిర్‌కండిషన్డ్ ప్రత్యేక రైళ్లు కూడా నడపవచ్చని రైల్వే వర్గాలు సూచించాయి. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ మార్గంగా రైళ్లను అందుబాటులో ఉంచడం లక్ష్యంగా తీసుకున్నామని అధికారులు తెలిపారు.
ఇండిగో విమాన సేవల్లో ఏర్పడిన అంతరాయం కారణంగా దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్ట్‌ల్లో గందరగోళం నెలకొన్న విషయాలు ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం వందలాది విమానాలు రద్దు కావడం, ఆలస్యమవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు రైల్వే శాఖ వేగంగా స్పందించి ప్రయాణికులకు ఉపశమనం కలిగించినట్లైంది.