విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారుల నుంచి సంప్రదాయ మర్యాదలతో పూర్వక స్వాగతం లభించగా, దేవాలయ సంస్కృతి ప్రకారం మంత్రిగారికి పూర్ణకుంభంతో ఆహ్వానం ఇచ్చి, ఆలయ రీతుల ప్రకారం ప్రత్యేక దర్శనం నిర్వహించారు. కప్పస్తంభం వద్ద ఆలింగనం చేసి స్వామివారిని దర్శించుకున్న అనంతరం, పండితులు వేద మంత్రోచ్ఛారణతో ఆశీర్వచనం అందించారు.
ఆలయ అధికారులు మంత్రిగారికి స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదం అందజేసి సత్కరించారు. వైకుంఠ ఏకాదశి సందర్బంగా ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి అనిత పరిశీలించారు. భక్తులు సౌకర్యంగా దర్శనం పొందేందుకు క్యూ లైన్లు, భద్రత, తాగునీరు, పార్కింగ్, పరిశుభ్రత వంటి అంశాలను వివరంగా పరిశీలించారు.
ఈ సందర్బంగా మంత్రి చిన్నారులకు పాలు పంపిణీ చేసి, భక్తులతో ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు మరియు ధార్మిక కార్యక్రమాల నిర్వహణపై ప్రభుత్వ చర్యలను భక్తులకు వివరించారు. ఆలయ పరిరక్షణ, నూతన సౌకర్యాల కల్పన, నిర్మాణ పనుల నిర్వహణ విషయంలో అధికారులు కృషి చేస్తుండటంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు.
మీడియాతో మాట్లాడుతూ మంత్రి వంగలపూడి అనిత దేవుని దయవల్ల ఎన్డీయే కూటమి ఏర్పడిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల పరిరక్షణ, పునరుద్ధరణ, ప్రక్షాళన వంటి పనులకు ప్రభుత్వం చురుకుగా ముందుకు వస్తోందని చెప్పారు. ప్రత్యేకంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటున్న ప్రాంతాల్లో సౌకర్యాలు మెరుగుపరచడం, క్యూలైన్లు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవడం, భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఆలయాలకు వచ్చే భక్తులు ప్రశాంతంగా స్వామిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించి ఆనందంగా తిరిగి వెళ్తేనే దేవస్థానాల ప్రతిష్ట పెరుగుతుందని పేర్కొన్నారు.
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఇటీవల జరిగిన ఉత్సవాలను ప్రభుత్వం వైభవంగా నిర్వహించిందని, లక్షల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆమె గుర్తుచేశారు. రాబోయే ముఖ్య ఉత్సవాలను కూడా అదే స్థాయిలో ఘనంగా నిర్వహించడానికి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ప్రముఖ ఆలయం అభివృద్ధి చెందేలా, ధార్మిక పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించేలా నిర్ణీత ప్రణాళికతో పనిచేస్తున్నామని మంత్రి వెల్లడించారు.