దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దులు కొనసాగుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలో అత్యంత రద్దీగా ఉన్న శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచే వరుసగా నాలుగోరోజు ఇండిగో విమానాలు నిలిచిపోవడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన 43 విమానాలు రద్దుకావడంతో టెర్మినల్స్‌లో ప్రయాణికులు గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. హైదరాబాద్‌కి చేరుకోనున్న మరో 26 ఇండిగో సర్వీసులు కూడా రద్దు కావడంతో ప్రయాణ ప్రణాళికలు పూర్తిగా తారుమారయ్యాయి.
రోజువారీ కార్యకలాపాలు, వ్యాపార ప్రయాణాలు, కుటుంబ అత్యవసరాలు అన్నీ విమానాల రద్దుల ప్రభావంతో నిలిచిపోయాయి. విమాన సేవల్లో ఏర్పడిన అంతరాయం దేశవ్యాప్తంగా కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. నిన్న ఒక్కరోజే వెయ్యికి పైగా ఇండిగో సర్వీసులు రద్దు కావడం గందరగోళానికి దారి తీసింది. ఈ పరిస్థితిని గమనించిన కేంద్రం అత్యవసర చర్యలకు పూనుకుంది. విమానయాన శాఖ మూడు రోజుల లోపు సేవలను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
పైలెట్ కొరత, షెడ్యూలింగ్ లోపాలు, అంతర్గత నిర్వహణ సమస్యలు కలిసి ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. పైలెట్ల పనిగంటలు మరియు విశ్రాంతి నియమాల్లో తాత్కాలిక మినహాయింపులు ఇచ్చి సేవలను త్వరగా పునరుద్ధరించే అవకాశం ఉందని విమానయాన శాఖ భావిస్తోంది. పూర్తిస్థాయి పరిస్థితి సవ్యంగా మారడానికి ఐదు నుంచి పది రోజులు పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
విమానాశ్రయాల్లో చిక్కుకున్న ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు రైల్వే శాఖ ముందుకు వచ్చింది. ప్రత్యేక రైళ్లు నడుపుతూ, ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తోంది. ఇప్పటికే 37 రైళ్లకు 116 అదనపు కోచ్లు జోడించినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. సికింద్రాబాద్–చెన్నై, చర్లపల్లి–కోల్‌కతా, హైదరాబాద్–ముంబై మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తుండగా, ఈ రైళ్లలో బెర్తులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది.
అత్యవసర ప్రయాణ అవసరాలు ఉన్నవారు వీటిని వినియోగించుకోవాలని సూచించింది. అదనపు డిమాండ్ పెరిగినప్పటికీ టికెట్ లభ్యత సమస్యలు తక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇండిగో సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రాముఖ్యతనిస్తుండగా, విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. 24 గంటల హెల్ప్‌లైన్ మరియు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రయాణికులకు సహాయం అందిస్తున్నారు.
విమానాల రద్దు వెనుక ఉన్న లోపాలపై ఉన్నతస్థాయి దర్యాప్తు కూడా కొనసాగుతోంది. సిబ్బంది కేటాయింపు, విశ్రాంతి సమయాలు, అంతర్గత ప్రణాళిక, నిర్వహణ లోపాలు అన్నింటినీ విచారణలో భాగంగా పరిశీలించనున్నారు. ఇటీవలి కాలంలో దేశంలో ప్రయాణాల కోసం ఇండిగోపై భారీగా ఆధారపడటం ఒక ప్రధాన కారణం. సర్వీసులు ఒక్కసారిగా తారుమారైనప్పుడు ప్రయాణికులకు ప్రత్యామ్నాయాలే లేకుండానే నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. రైల్వే శాఖ చర్యలు కొంత ఉపశమనాన్ని అందిస్తున్నప్పటికీ, విమాన సేవలు పూర్తిగా సాధారణ స్థితికి చేరేవరకు ప్రయాణికులు సహనంతో ఉండాల్సిన అవసరం ఉంది..