తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రారంభం అయ్యే వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా లక్షలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది.
దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే తొలి మూడు రోజుల కోసం మొత్తం 1,76,000 మంది భక్తులను ఈ- డిప్ ద్వారా ఎంపిక చేశారు. ఈ పరిస్థితుల మధ్య టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్.. డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలను ఇచ్చారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ఈ ఉదయం ఈ కార్యక్రమం ఏర్పాటైంది. వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించి టీటీడీ చేపట్టిన ఏర్పాట్లపై ఈవో భక్తులకు వివరించారు.
వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయించినట్లు అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మొదటి మూడు రోజులు కూడా ప్రత్యేక ప్రవేశం, శ్రీవాణి దర్శనాలు రద్దయినట్లు వివరించారు.
మిగిలిన ఏడు రోజుల కోసం ఈ ఉదయం 10 గంటలకు శ్రీవాణి, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేసినట్లు తెలిపారు. రోజుకు శ్రీవాణి- 1,000, ప్రత్యేక ప్రవేశం- 15,000 టికెట్లు జారీ అవుతాయని అన్నారు.
జనవరి 2 నుండి 8వ తేదీ వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా భక్తులకు సర్వ దర్శనం కల్పిస్తామని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. ఈ 10 రోజుల్లో తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయబోమని తేల్చి చెప్పారు.
అలాగే ఈ 10 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేశామని అన్నారు. తిరుమలకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శనం కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. దాతలకు సంబంధించిన టికెట్లను ఈ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చామని అనిల్ కుమార్ సింఘాల్ వివరించారు.
జనవరి 6, 7, 8 తేదీలలో స్థానికుల దర్శనానికి డిసెంబర్ 10వ తేదీన ఆన్ లైన్ బుకింగ్ అందుబాటులో ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకు అధిక ప్రాధాన్యత, ఇందులో రాజీపడబోమని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీ కృష్ణ, సీఈ సత్యనారాయణ పాల్గొన్నారు.