పౌర విమానాయాన మంత్రిత్వ శాఖ ఇండిగో ఎయిర్‌లైన్‌పై కఠిన చర్యలు తీసుకుంది. ఇటీవల విమానాల రద్దు, ఆలస్యాలు, ప్రయాణికులకి కలిగిన తీవ్ర ఇబ్బందుల నేపథ్యంలో అన్ని పెండింగ్ రిఫండ్లను వెంటనే పూర్తిచేయాలని మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం, ప్రయాణికుల రిఫండ్ ప్రక్రియ మొత్తం డిసెంబర్ 7వ తేదీ, ఆదివారం సాయంత్రం 8 గంటలలోపు పూర్తిగా ముగియాలి. ఎలాంటి కారణం ఉన్నా కూడా రిఫండ్ ఆలస్యమవ్వకూడదని X (ట్విట్టర్) వేదిక ద్వారా స్పష్టం చేసింది.
ఇండిగో విమానాల్లో గత కొన్ని రోజులుగా భారీ అంతరాయాలు చోటుచేసుకున్నాయి. వందలాది విమానాలు రద్దు కావడంతో అనేక మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లలో ఇబ్బందులకు గురైనవి ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం . కొందరు టికెట్లు రద్దు చేసినా రిఫండ్ అందక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై ప్రయాణికులు ప్రభుత్వానికి, నియంత్రణ మండలికి వరుసగా ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నేరుగా జోక్యం చేసుకుని ఇండిగోను రిఫండ్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించింది.
మంత్రిత్వ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విమానాలు రద్దు కావడం లేదా ఆలస్యమవడం కారణంగా ప్రయాణికుల బ్యాగులు వేరు కావడం, ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకుపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. దీనిపై మంత్రిత్వ శాఖ ఇండిగోను ప్రత్యేకంగా ఆదేశిస్తూ, ప్రస్తుతం ఎక్కడ ఉన్నా కూడా 48 గంటల్లోపుగా ప్రయాణికుల సూచించిన చిరునామాకో బ్యాగులు చేరేలా చూడాలని చెప్పింది.
ఇండిగోపై ప్రయాణికుల ఒత్తిడి పెరుగుతుండగా, ప్రభుత్వం సూచించిన గడువులో రిఫండ్ ప్రక్రియ పూర్తవుతుందో లేదో చూడాలి. బాగేజీ డెలివరీ 48 గంటల్లో జరిగితే ప్రయాణికులకు కొంత ఉపశమనం లభిస్తుంది. సమస్య తీవ్రత పెద్దది అయినప్పటికీ, ప్రభుత్వ ఆదేశాలు పరిస్థితిని కొంత నియంత్రణలోకి తెచ్చే అవకాశం ఉంది. విమాన ప్రయాణ సేవలు సాధారణ స్థితికి రావాలంటే ఇండిగో, విమానయాన అధికారులు సమన్వయంతో పనిచేయాల్సి ఉంది.