అమెరికాలో హెచ్–1బీ వీసాల వినియోగంపై మరోసారి తీవ్రమైన చర్చ వెల్లువెత్తుతోంది. అగ్ర టెక్ కంపెనీలు స్థానిక అమెరికన్ ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నప్పటికీ, అదే సమయంలో వేల సంఖ్యలో విదేశీ నిపుణులను నియమించుకుంటున్నాయన్న ఆరోపణలతో అక్కడి రాజకీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ సెనేటర్ రూబెన్ గాలెగో ప్రభుత్వం ఈ అంశంపై అత్యవసర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేయడంతో ఈ చర్చ వేడెక్కింది. హెచ్–1బీ వీసాలపై అధికంగా ఆధారపడే భారతీయ ఐటీ నిపుణులు, ఇంజనీర్ల భవిష్యత్తుపై ఈ పరిణామాలు ప్రత్యక్ష ప్రభావం చూపవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వివాదంపై గాలెగో నేరుగా కార్మిక శాఖ కార్యదర్శి, యూఎస్‌సీఐఎస్ డైరెక్టర్, అమెరికా అటార్నీ జనరల్‌కు లేఖ రాస్తూ పలు కీలక విషయాలను ప్రస్తావించారు. నైపుణ్యం కలిగిన వలసదారులు అమెరికా ఉద్యోగ మార్కెట్‌కు అవసరమేనని అంగీకరిస్తూనే, ఈ వీసా కార్యక్రమం అమెరికన్ ఉద్యోగులను తొలగించడానికి లేదా వారి స్థానాల్లో విదేశీయులను నియమించడానికి మార్గం కాదని ఆయన పేర్కొన్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో 30,000 మందికి పైగా విదేశీ నిపుణులకు హెచ్–1బీ వీసాలు మంజూరయ్యాయని, అదే సమయంలో పెద్ద టెక్ సంస్థలు లక్షల్లో స్థానిక ఉద్యోగులను తొలగించటం అనుమానాలకు తావిస్తోందని గాలెగో వెల్లడించారు.
అమెరికా యువతపై ఈ విధానం తీవ్రమైన ప్రభావం చూపుతోందని గాలెగో గణాంకాలతోనే ప్రస్తావించారు. 2023 జనవరిలో 21–25 ఏళ్ల మధ్య వయసున్న ఉద్యోగుల శాతం 15% కాగా, 2025 జూలై నాటికి అది 6.7%కి పడిపోయిందని ఆయన తెలిపారు. ఈ క్షీణత యాదృచ్ఛికం కాదని, టెక్ కంపెనీలు ఖర్చుల తగ్గింపు పేరుతో అమెరికన్ యువతను పక్కనపెట్టి, తక్కువ ఖర్చుతో పని చేసే విదేశీ నిపుణులను ఎంపిక చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. హెచ్–1బీ వీసాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రారంభించిన ‘ప్రాజెక్ట్ ఫైర్‌వాల్’ అమలుపై కూడా ఆయన సందేహాలు వ్యక్తం చేశారు.
ఈ పరిణామాలను భారత ఐటీ రంగం అత్యంత జాగ్రత్తగా గమనిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా హెచ్–1బీ వీసాలు పొందుతున్న వారిలో భారతీయులే అత్యధిక శాతం. అమెరికా వలస విధానాలు కఠినతరం అయితే, అక్కడ ఉద్యోగాలు ఆశిస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు, ఇంజనీర్లకు భారీ దెబ్బ తగలవచ్చు. అమెరికా కంపెనీలను ప్రధాన క్లయింట్లుగా కలిగిన భారతీయ ఐటీ సంస్థల వ్యాపారంపైనా ప్రభావం ఉండొచ్చు. అందుకే, సెనేటర్ లేఖతో ప్రారంభమైన ఈ దర్యాప్తు డిమాండ్, అమెరికా రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తూ భారతీయ ఉద్యోగార్థుల భవిష్యత్తును నిర్ణయించే అంశంగా మారింది.