భారత రూపాయి మారకం విలువ అమెరికన్ డాలర్తో పోలిస్తే జీవనకాల కనిష్ఠాలకు పతనమవుతోంది. రూపాయి విలువ 90.70-91 మార్ను తాకనుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) కీలక వ్యాఖ్యలు చేశారు.
రూపాయి పతనం పూర్తిగా ప్రతికూలమేమీ కాదని, ఇలాంటి పరిస్థితులు ఎగుమతిదారులకు ప్రయోజనకరమేనని వెల్లడించారు. ఈ మేరకు హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో మాట్లాడారు.
ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని మంత్రి అన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కంటే.. ఇప్పుడు ఆర్థికవ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉందని వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక అంశాలను క్రమబద్ధీకరించామన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రూపాయిపై చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు.
"రూపాయి విలువ తగ్గినప్పుడు.. మన ఎగుమతిదారులు దానిని సద్వినియోగం చేసుకుంటున్నారని నేను కచ్చితంగా చెప్పగలను. మన ఉత్పత్తులపై సుంకాల వేళ.. ఇదికాస్త సానుకూలమే. రూపాయి కదలికలతో పాటు ఆర్థిక వ్యవస్థ బలాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
కరెన్సీ హెచ్చుతగ్గులు ఆర్థిక వ్యవస్థ పనితీరును నిర్ణయించలేవు" అని అన్నారు. కుటుంబాల్లో పొదుపు తగ్గుతోందన్న ఆందోళనలను మంత్రి తోసిపుచ్చారు. పొదుపు, పెట్టుబడులు పెరుగుతున్నాయని వెల్లడించారు. సంప్రదాయ పొదుపు మార్గాల్లో మార్పులు వస్తుండటంతో అలా అనిపిస్తుందని, కానీ వాస్తవంగా పొదుపు తగ్గడం లేదన్నారు.
పైగా ఆస్తులు పెరుగుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో బ్యాంకు రుణాలు ఉపకరిస్తున్నాయని చెప్పారు. కాగా.. భారత్-అమెరికా డీల్పై అనిశ్చితులు, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం వంటి కారణాలతో కొన్ని రోజులుగా రూపాయి మారకం విలువ పతనమవుతోంది.
వస్తువులకు చెల్లింపులు చేసేందుకు దిగుమతిదారులు భారీగా డాలర్లను కొనుగోలు చేస్తుండటం రూపాయి విలువపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది.