Minister Narayana: ఉదయగిరి అభివృద్ధికి పరిశ్రమలే బలమైన పునాది.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు!
Minister Narayana: ఉదయగిరి ప్రాంత సమగ్ర అభివృద్ధికి పరిశ్రమలే ప్రధాన ఆధారమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. సోమవారం ఉదయగిరి పర్యటనలో భాగంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ప్రాంత అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు లక్ష్యంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోందన్నారు.
రెండేళ్లలో ఉదయగిరికి రూ.1,098 కోట్ల అభివృద్ధి నిధులు..
ఏపీలో పెట్టుబడుల వృద్ధికి చంద్రబాబు, లోకేశ్ కృషి: నారాయణ..
ఉదయగిరి ప్రాంత సమగ్ర అభివృద్ధికి పరిశ్రమలే ప్రధాన ఆధారమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. సోమవారం ఉదయగిరి పర్యటనలో భాగంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ప్రాంత అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు లక్ష్యంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోందన్నారు.
గత రెండేళ్లలో ఉదయగిరి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం మొత్తం రూ.1,098.79 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. నాలుగు పరిశ్రమలకు ఇప్పటికే ఆమోదం లభించిందని, వాటి ద్వారా సుమారు 4,000 మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. పరిశ్రమల స్థాపనతో పాటు పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.
ఉదయగిరికి వచ్చిన మంత్రి నారాయణకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రూ.1.70 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. అలాగే దర్గా సెంటర్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.
మంత్రి నారాయణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. యువనేత నారా లోకేశ్ కృషితో దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్కు తీసుకురాగలిగామని తెలిపారు. పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ నాయకత్వంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని అన్నారు.
గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన మంత్రి నారాయణ, రూ.10 లక్షల కోట్ల అప్పులు రాష్ట్రంపై భారంగా మారాయని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమాన్ని మళ్లీ గాడిలో పెడుతున్నామని చెప్పారు. అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించి రోజుకు 2.25 లక్షల మందికి భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే టిడ్కో ఇళ్ల ప్రాజెక్టు గతంలో తీవ్రంగా తగ్గిపోయిందని, ఇప్పుడు వాటిని మళ్లీ ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.
వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సేవలు ప్రశంసనీయమని మంత్రి అభినందించారు. తాను కూడా “నారాయణ నేత్రజ్యోతి” కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలకు సేవలందిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ, మంత్రి నారాయణ రాకతో ఉదయగిరి అభివృద్ధి వేగం పెరుగుతుందని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ప్రాంత రూపురేఖలు మారిపోతాయని చెప్పారు. ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మాట్లాడుతూ టీడీపీ పాలనలో ఉదయగిరి అభివృద్ధి మరింత వేగంగా జరుగుతోందని తెలిపారు. తాగు, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకువస్తామని చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రోడ్డు పనులు, నిధుల కేటాయింపు, అటవీ శాఖ అనుమతులు, అలాగే మరో అన్నా క్యాంటీన్ ఏర్పాటు వంటి అంశాలను కోరారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కంభం విజయరామిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతమ్మ, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొత్తంగా ఉదయగిరి అభివృద్ధికి పరిశ్రమలే బలమైన పునాది అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Tags
Be the first to react