Farmers: కిలో పొగాకు ధర రూ.200 కంటే తగ్గొద్దు.. కొనుగోలుదారులకు మంత్రి సూచన!
Farmers: రాష్ట్రంలోని పొగాకు రైతులను ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోనివ్వబోమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. ఈ సీజన్లో రైతులు పండించిన చివరి పొగాకు ఆకు వరకు కొనుగోలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు.
ఈ సీజన్లో ఒక్క పొగాకు రైతు కూడా నష్టపోరు: మంత్రి డోలా బీవీ స్వామి..
టంగుటూరు పొగాకు వేలం కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి..
ప్రకాశం జిల్లా: రాష్ట్రంలోని పొగాకు రైతులను ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోనివ్వబోమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. ఈ సీజన్లో రైతులు పండించిన చివరి పొగాకు ఆకు వరకు కొనుగోలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు.
బుధవారం ప్రకాశం జిల్లా టంగుటూరులోని పొగాకు వేలం కేంద్రాన్ని మంత్రి సందర్శించారు. అక్కడ జరుగుతున్న వేలం ప్రక్రియను స్వయంగా పరిశీలించి, పొగాకు బేళ్లను పరిశీలించారు. అనంతరం రైతులు, వ్యాపారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కొనుగోలుదారులకు మంత్రి కీలక సూచనలు చేశారు. కిలో పొగాకు ధర రూ.200 కంటే తగ్గకుండా కొనుగోలు చేయాలని, రైతులకు న్యాయమైన ధర లభించేలా సహకరించాలని వ్యాపారులను కోరారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పొగాకు రైతుల సమస్యలపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారని గుర్తు చేశారు. ఆ సమావేశంలో పొగాకు బోర్డు అధికారులు, రైతులు, వ్యాపారులు, మంత్రులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారని తెలిపారు. కిలో ధర రూ.200 కంటే తగ్గకుండా చూడాలని, ఎక్కడా 'నో బిడ్' పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెప్పారు.
ముఖ్యమంత్రి సూచనల మేరకు పొగాకు బోర్డు తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని మంత్రి పేర్కొన్నారు. బోర్డు సెలక్షన్ గ్రేడ్ను తీసుకోవడంతో పాటు, వ్యాపారులు అన్ని వేలం వేదికల్లో చురుకుగా పాల్గొని రైతులకు మద్దతుగా నిలవాలని కోరారు. రైతులకు మేలు జరిగేలా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వ్యాపారులతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.
టంగుటూరు వేలం కేంద్రంలో రైతులు తెలిపిన సమస్యలు, అక్కడ గమనించిన అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని మంత్రి చెప్పారు. రైతులు పండించిన పొగాకును చివరి ఆకు వరకు కొనుగోలు చేసేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని, ఈ సీజన్లో ఒక్క పొగాకు రైతు కూడా నష్టపోకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి భరోసా ఇచ్చారు.