Health: ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మెరుగుపరచాలి.. ప్రజల సంతృప్తి 85 శాతానికి పెంచాలి.. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు!

Health: ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యతను మరింత పెంచి, ప్రజల్లో ప్రభుత్వ వైద్య వ్యవస్థపై సంతృప్తి స్థాయిని 85 శాతానికి తీసుకెళ్లాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు.

Minister Satya Kumar Yadav
Minister Satya Kumar Yadav

ప్రజల సంతృప్తి 85 శాతానికి చేరాలి.. వైద్య సేవలపై మంత్రి సమీక్ష..

ఆసుపత్రుల పనితీరుకు కొత్త మదింపు విధానం.. సిబ్బంది సేవలకు పక్కా లెక్కలు..

అమరావతి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యతను మరింత పెంచి, ప్రజల్లో ప్రభుత్వ వైద్య వ్యవస్థపై సంతృప్తి స్థాయిని 85 శాతానికి తీసుకెళ్లాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు, సిబ్బంది జవాబుదారీతనం, శానిటేషన్, సీజనల్ వ్యాధుల నియంత్రణ తదితర అంశాలపై మంగళవారం మంత్రి ఉన్నతాధికారులతో సుమారు మూడు గంటల పాటు సమీక్ష నిర్వహించారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలంటే ప్రభుత్వ వైద్య సిబ్బందిలో మరింత బాధ్యత పెరగాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ఆసుపత్రుల పనితీరు అంచనా విధానంలో మార్పులు తీసుకురావాలని సూచించారు.

గత రెండేళ్లుగా రాష్ట్రంలోని చిన్నా పెద్దా కలిపి సుమారు 12,800 ఆసుపత్రుల్లో అందించిన ఓపీ, ఐపీ సేవలు, శస్త్రచికిత్సలు, డయాగ్నస్టిక్ పరీక్షల ఆధారంగా పనితీరును అంచనా వేస్తున్నామని అధికారులు వివరించారు. అయితే సేవల సంఖ్య ఆధారంగా మాత్రమే కాకుండా, ప్రతి వైద్యుడు, నర్సు, టెక్నీషియన్ అందించాల్సిన సేవల స్థాయిని నిర్ణయించి దాని ఆధారంగా మదింపు చేయాలని మంత్రి సూచించారు.

వైద్యులు, ఇతర సిబ్బంది, ఆసుపత్రుల పనితీరును ప్రతి నెలా పరిశీలించి లోపాలను గుర్తించి పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా గరిష్ట ప్రయోజనం అందేలా పక్కా లెక్కలు ఉండాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుధ్య సేవలు సక్రమంగా ఉండాలని మంత్రి తెలిపారు. కొత్త ఏజెన్సీల నియామకం తర్వాత హాజరు నమోదు వంటి సాంకేతిక సమస్యల కారణంగా కొన్ని చోట్ల శానిటేషన్ సేవల్లో లోపాలు వచ్చాయని పేర్కొన్నారు.

ఈ సమస్యలను పరిష్కరించినందున పూర్తి స్థాయిలో పారిశుధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచి ఆసుపత్రుల్లో పరిశుభ్రతను మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. శానిటేషన్ విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని హెచ్చరించారు.

ప్రెసిడెన్షియల్ ఆర్డర్-2025 ప్రకారం రాష్ట్రాన్ని 6 జోన్లు, 2 మల్టీ జోన్లుగా విభజించే ప్రక్రియపై కూడా మంత్రి సమీక్షించారు. ఈ మార్పుల ప్రభావం ఉద్యోగుల నియామకాలు, బదిలీలు, పదోన్నతులపై ఎలా ఉంటుందో పరిశీలించారు.

ప్రజారోగ్య వ్యవస్థ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని మార్పులను ప్రభుత్వానికి సూచించాలని నిర్ణయించారు. డాక్టర్లు, ఇతర సిబ్బంది కేడర్ విభజనపై కూడా చర్చించారు.

మంత్రి కార్యాలయం నుంచి పంపే సమస్యలు, ప్రజల వినతులకు అధికారులు 30 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై ఆలస్యం లేకుండా స్పందించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.

గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం కాలంలో 3 వేల మందికి పైగా వైద్యులు, మొత్తం సుమారు 12 వేల మంది సిబ్బంది నియామకాలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. రానున్న మూడేళ్లలో అవసరమైన ఖాళీలను భర్తీ చేసేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.

వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో మలేరియా, డెంగీ, చికున్గున్యా వంటి సీజనల్ వ్యాధులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. జిల్లాల వారీగా కేసుల పరిస్థితిని సమీక్షించి, నివారణ చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.

జిల్లా స్థాయిలో డీఎంహెచ్వోలు ప్రతి వారం పరిస్థితిని సమీక్షించి చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సమీక్షలో వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags

Be the first to react

Latest