Kollu Ravindra: గ్రామాల అభివృద్ధే లక్ష్యం.. ఉపాధి హామీతో మౌలిక సదుపాయాల విస్తరణ.. మంత్రి కొల్లు రవీంద్ర!
Kollu Ravindra: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనే ప్రధాన లక్ష్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం సమీపంలోని మేకవానిపాలెంలో నిర్వహించిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవిక మిషన్ (వీబీజీ రామ్ జీ) కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
మేకవానిపాలెంలో వీబీజీ రామ్ జీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మంత్రి కొల్లు రవీంద్ర..
ఉపాధి హామీ పథకంలో 32 పనులు చేర్చిన ఘనత చంద్రబాబుదే: కొల్లు రవీంద్ర..
మచిలీపట్నం: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనే ప్రధాన లక్ష్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం సమీపంలోని మేకవానిపాలెంలో నిర్వహించిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవిక మిషన్ (వీబీజీ రామ్ జీ) కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని, పని ప్రదేశాల్లో కల్పిస్తున్న సదుపాయాలపై ఆరా తీశారు.
మంత్రి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం గతంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించిందని గుర్తు చేశారు. అప్పట్లో ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో, పనికి బదులుగా బియ్యం అందించే పథకాన్ని నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారని చెప్పారు. అనంతరం అదే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంగా మారి కార్మికులకు వేతనాలు చెల్లించే విధానం అమల్లోకి వచ్చిందన్నారు.
2014లో ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కంపోనెంట్ను జోడించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడిదేనని మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు చెరువులు, కాలువలు తవ్వడం వంటి పనులకే పరిమితమైన ఈ పథకంలో, ఆయన సూచనలతో 32 రకాల అభివృద్ధి పనులను చేర్చారని చెప్పారు. దీంతో గ్రామాల్లో సీసీ రోడ్లు, కాంపౌండ్ గోడలు వంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టే అవకాశం కలిగిందన్నారు.
ప్రస్తుతం దేశాన్ని ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలబెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో పనిదినాలు పెంచడంతో పాటు చెరువులు, కాలువలు వంటి కీలక పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.
పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న సమయంలో నారా లోకేశ్ రాష్ట్రవ్యాప్తంగా 27 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించారని మంత్రి గుర్తుచేశారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు.
గత ఐదేళ్లలో ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, కేంద్రం ఇచ్చిన నిధులను కూడా దారి మళ్లించడంతో గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. ఒక్క రహదారిపైనా మట్టి వేయలేని పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మచిలీపట్నం నియోజకవర్గంలో రూ.42 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 2,21,812 మంది ఉపాధి హామీ కార్మికులు ఉండగా, మచిలీపట్నం నియోజకవర్గంలో 18,116 మంది కార్మికులు ఉన్నారని చెప్పారు. జిల్లాలో 49 లక్షల పనిదినాలు, నియోజకవర్గంలో 3.35 లక్షల పనిదినాలు కల్పించామని వివరించారు. ఉపాధి హామీ నిధులతో రూ.53 కోట్ల వ్యయంతో 393 రోడ్లు ప్రతిపాదించగా, ఇప్పటికే 382 రోడ్ల పనులు పూర్తయ్యాయని వెల్లడించారు.
వచ్చే ఏడాది చివరి నాటికి ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మచిలీపట్నం బీచ్ రోడ్తో పాటు నియోజకవర్గంలోని అన్ని రహదారులను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. సాస్కీ పథకం కింద రూ.19 కోట్లు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. అలాగే రూ.20 కోట్లతో కానూరు వంతెన నిర్మాణం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కరగ్రహారం వద్ద మరో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు, బందరుకోట నుంచి గరాలదిబ్బ మీదుగా కోడూరు వరకు వంతెన పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడమే కాకుండా స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
బందరు పోర్టు పనులు వచ్చే జనవరి నాటికి పూర్తవుతాయని, పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా ఏర్పాటు కానున్నాయని మంత్రి చెప్పారు. మంగినపూడి బీచ్, పోర్టు అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండేందుకు బందరు బీచ్లో 63 అడుగుల మహాగణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన భూమిపూజ జూలై 3 ఉదయం 7.11 గంటలకు జరుగుతుందని వెల్లడించారు.
సంక్షేమ పథకాల అమలుపైనా మంత్రి వివరాలు వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు మంజూరు చేస్తున్నామని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు రూ.65 వేల కోట్లను పెన్షన్ల రూపంలో పంపిణీ చేసినట్లు తెలిపారు. "తల్లికి వందనం" పథకాన్ని అమలు చేస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. జూలై 15 నాటికి తల్లికి వందనం పథకం కింద నగదు జమ చేస్తామని తెలిపారు. "అన్నదాత సుఖీభవ" ద్వారా రైతులకు రూ.20 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నామని, ఉచిత గ్యాస్ పథకం కింద ఇప్పటికే నాలుగున్నర కోట్లకు పైగా సిలిండర్లు పంపిణీ చేశామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా అమలవుతోందన్నారు.
యువతకు స్థానికంగానే ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు మంచి పాలన అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని, ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదని, యువతకు ఉద్యోగాలు కల్పించలేదని ఆరోపించారు. అమరావతిపై వైఖరి మార్చడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. ఇటీవల కూడా అమరావతి పేరుతో రాజకీయాలు చేయాలని ప్రయత్నించగా ప్రజలు తిరస్కరించారని అన్నారు.
కూటమి ప్రభుత్వం అమరావతి, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తోందని, పెట్టుబడులు ఆకర్షించి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తోందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రతిపక్ష లక్ష్యంగా మారిందని ఆరోపించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అభివృద్ధికి సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, రూరల్ మండలాధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు, అధికారులు, ఉపాధి హామీ కార్మికులు పాల్గొన్నారు.
Tags
Be the first to react