శ్రీశైలానికి 43 కి.మీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కసరత్తు!
Elevated Corridor: దట్టమైన అభయారణ్యాల గుండా వెళ్లే రహదారులకు 'ఎలివేటెడ్ కారిడార్' అత్యుత్తమ అంతర్జాతీయ పరిష్కారం. నల్లమల అడవిలో ప్రస్తుతం రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు రవాణా నిషేధం ఉన్నప్పటికీ, పగటిపూట వాహనాల రద్దీ వల్ల వన్యప్రాణుల ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు తలెత్తుతున్నాయి. 30 మీటర్ల వెడల్పుతో పిల్లర్లపై వంతెన నిర్మించడం వల్ల అడుగున వన్యప్రాణుల సహజ కారిడార్‌కు ఎలాంటి విఘాతం కలగదు, అదే సమయంలో శ్రీశైల భక్తులకు 24 గంటల సురక్షిత, వేగవంతమైన ప్రయాణ సౌకర్యం లభిస్తుంది.
సుండిపెంట డ్యామ్ నుంచి దోర్నాల వరకు ఎన్హెచ్ఏఐ సర్వే!
30 మీటర్ల వెడల్పుతో నల్లమల అడవిపై వంతెన రహదారి!
రాత్రివేళ ప్రయాణ ఆంక్షలకు శాశ్వత పరిష్కారం!
Srisailam: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీశైలానికి వెళ్లే రహదారిని ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రణాళిక సిద్ధం చేసింది. జాతీయ రహదారి-765 (NH-765) పరిధిలో నంద్యాల జిల్లా సుండిపెంట డ్యామ్ నుంచి మార్కాపురం జిల్లా దోర్నాల వరకు సుమారు43 కిలోమీటర్ల దూరం నల్లమల అడవిపై నుంచి వంతెన రహదారి (ఎలివేటెడ్ కారిడార్) నిర్మించాలని భావిస్తోంది. దీనికోసం అటవీశాఖ పర్యవేక్షణలో శ్రీజ్యోతి ఇంజనీరింగ్ సంస్థ ద్వారా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) బృందం క్షేత్రస్థాయి సర్వే చేపట్టింది.
రాత్రివేళ ప్రయాణ ఆంక్షలకు శాశ్వత పరిష్కారం
నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ అభయారణ్యంలో వన్యప్రాణుల సంరక్షణను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతం ప్రతిరోజూ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నల్లమల ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలపై నిషేధం అమల్లో ఉంది. మహాశివరాత్రి, ఉగాది పర్వదినాలు మినహా మిగిలిన రోజుల్లో కేవలం పగటిపూట మాత్రమే అనుమతి ఇస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత శ్రీశైల మల్లన్న దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో, ఈ ఆంక్షల వల్ల రాత్రివేళల్లో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పర్యావరణానికి విఘాతం కలగకుండా 24 గంటల ప్రయాణం
వన్యప్రాణుల సంచారానికి, పర్యావరణ సమతుల్యతకు ఎలాంటి ఆటంకం కలగకుండా శ్రీశైలానికి నిరంతరం, తక్కువ సమయంలో ప్రయాణం సాగించేలా చర్యలు చేపట్టాలని కేంద్రం అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో భూమిపై నుంచి కాకుండా పిల్లర్ల సహాయంతో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీనివల్ల కింద అడవిలో వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించే వీలు కలుగుతుంది.
మూలమలుపులు లేకుండా 30 మీటర్ల వెడల్పుతో నిర్మాణం
ఈ ఎలివేటెడ్ కారిడార్‌ను30 మీటర్ల వెడల్పుతో, ప్రమాదకరమైన ఘాట్ రోడ్డు మూలమలుపులు లేకుండా పిల్లర్ల ఆధారంగా నిర్మించాలని యోచిస్తున్నట్లు సర్వే అధికారి వెంకటేశ్వరరావు వెల్లడించారు. నేరుగా వంతెనపై ప్రయాణం సాగడం వల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా, ఘాట్ రోడ్డు ప్రమాదాలకు కూడా చెక్ పడనుంది.
శరవేగంగా సర్వే – మరో 20 రోజుల్లో పూర్తి
అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ ఎలివేటెడ్ కారిడార్ సర్వే పనులు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే శ్రీశైలం, నెక్కంటి అటవీ రేంజ్‌ల పరిధిలో సర్వే విజయవంతంగా పూర్తయిందని, ప్రస్తుతం దోర్నాల రేంజ్ పరిధిలో సర్వే కొనసాగుతోందని వివరించారు. మరో 20 రోజుల్లో సర్వే ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని పేర్కొన్నారు.
Tags
Be the first to react