శ్రీశైలం భక్తులకు గుడ్‌న్యూస్.. దోర్నాల నుంచి నాలుగు లైన్ల ఎలివేటెడ్ హైవే!

Srisailam Elevated Corridor: శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనను పరిశీలిస్తోంది. నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, శ్రీశైలానికి నిరంతర రాకపోకలు సాగించేలా దోర్నాల నుంచి సుండిపెంట వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని యోచిస్తోంది. ఈ ప్రతిపాదనలో భాగంగా నేషనల్ హైవే అథారిటీ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు ప్రత్యేక సర్వే చేపట్టారు.

Srisailam Elevated Corridor
Srisailam Elevated Corridor

శ్రీశైలానికి నల్లమల మీదుగా ఎలివేటెడ్ కారిడార్.. 43 కిలోమీటర్ల మేర ప్రత్యేక సర్వే..

శ్రీశైలం ప్రయాణం మరింత సులభం కానుందా? ఎలివేటెడ్ కారిడార్‌పై సర్వే ప్రారంభం..

శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనను పరిశీలిస్తోంది. నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, శ్రీశైలానికి నిరంతర రాకపోకలు సాగించేలా దోర్నాల నుంచి సుండిపెంట వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని యోచిస్తోంది. ఈ ప్రతిపాదనలో భాగంగా నేషనల్ హైవే అథారిటీ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు ప్రత్యేక సర్వే చేపట్టారు.

జాతీయ రహదారి 765 పరిధిలో నంద్యాల జిల్లా సుండిపెంట డ్యామ్‌ నుంచి మార్కాపురం జిల్లా దోర్నాల వరకు సుమారు 43 కిలోమీటర్ల పొడవున ఈ కారిడార్ నిర్మించాలని ప్రాథమికంగా భావిస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతం మీదుగా సాధారణ రహదారికి బదులుగా పిల్లర్లపై వంతెన తరహాలో హైవే నిర్మించాలన్నది ప్రతిపాదన. ఇందుకోసం అటవీశాఖ పర్యవేక్షణలో శ్రీజ్యోతి ఇంజినీరింగ్ సంస్థ సహకారంతో ఎన్‌హెచ్‌ఏఐ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహిస్తోంది.

ప్రస్తుతం నాగార్జునసాగర్‌-శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక ఆంక్షలు అమలవుతున్నాయి. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ మార్గంలో వాహనాల రాకపోకలను నిషేధించారు. శ్రీశైలం ఘాట్ రోడ్డులో సాధారణ రోజుల్లో భక్తులు, వాహనాలకు పగటి వేళల్లోనే ప్రయాణానికి అనుమతి ఇస్తున్నారు. మహాశివరాత్రి, ఉగాది వంటి ప్రత్యేక పర్వదినాలకు మాత్రం మినహాయింపులు ఉంటాయి. దీంతో రాత్రి వేళల్లో ప్రయాణించాల్సిన భక్తులు, ఇతర వాహనదారులకు పరిమితులు ఎదురవుతున్నాయి.

రాష్ట్ర విభజన తర్వాత శ్రీశైలం దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా పర్వదినాలు, సెలవుల సమయంలో రహదారిపై రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఒకవైపు భక్తుల ప్రయాణ అవసరాలు, మరోవైపు పులులు సహా ఇతర వన్యప్రాణుల సంరక్షణ బాధ్యతలను సమన్వయం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతంలో జంతువుల సహజ సంచారానికి ఆటంకం కలగకుండా, భక్తులు తక్కువ సమయంలో శ్రీశైలానికి చేరుకునేలా ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలించాలని కేంద్రం అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఈ ఆలోచనలో భాగంగానే ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన ముందుకు వచ్చింది.

ప్రతిపాదిత కారిడార్‌ను సుమారు 30 మీటర్ల వెడల్పుతో నిర్మించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. పెద్దగా మూలమలుపులు లేకుండా, పిల్లర్ల సహాయంతో రహదారిని ఎత్తులో నిర్మించాలని యోచిస్తున్నట్లు సర్వే అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నిర్మాణ విధానం వల్ల అటవీ నేలపై నేరుగా రహదారి వేయాల్సిన అవసరం తగ్గుతుందా, వన్యప్రాణుల కదలికలకు ఎంతవరకు అనుకూలంగా ఉంటుంది అనే అంశాలను సర్వేలో పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

అక్టోబరు 1 నుంచి ఈ సర్వే కొనసాగుతోందని వెంకటేశ్వరరావు వెల్లడించారు. శ్రీశైలం, నెక్కంటి అటవీ రేంజ్‌ల పరిధిలో సర్వే పూర్తయిందని, ప్రస్తుతం దోర్నాల రేంజ్ పరిధిలో పనులు జరుగుతున్నాయని వివరించారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో 20 రోజుల సమయం పట్టవచ్చని తెలిపారు.

ప్రస్తుతం ఇది సర్వే, పరిశీలన దశలో ఉన్న ప్రతిపాదన మాత్రమే. సర్వే నివేదిక ఆధారంగా కారిడార్‌కు సంబంధించిన తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పర్యావరణ అనుమతులు, వన్యప్రాణుల సంరక్షణ అంశాలు ఈ ప్రాజెక్టులో కీలకం కానున్నాయి. ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే శ్రీశైలం వెళ్లే భక్తులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడటంతో పాటు నల్లమల అటవీ ప్రాంతాన్ని కాపాడుతూ అభివృద్ధి పనులు చేపట్టే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు కానుంది.

Tags

Be the first to react

Latest