మంచు మనోజ్ భార్య భూమా మౌనిక స్టార్టప్... ఏపీ ప్రభుత్వంతో రూ.36 కోట్ల ఒప్పందం!

CII Summit 2026: మంచు మనోజ్ భార్య భూమా మౌనిక స్థాపించిన నమస్తే వరల్డ్ సంస్థ ఏపీ ప్రభుత్వంతో రూ.36.24 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. కర్నూలు, విశాఖలో తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసి 1,050 మందికి ఉపాధి కల్పించనుంది.

ఏపీ పారిశ్రామిక రంగంలోకి భూమా మౌనిక
ఏపీ పారిశ్రామిక రంగంలోకి భూమా మౌనిక
  • భూమా మౌనిక కొత్త ప్రయాణం.. కర్నూలు, విశాఖలో భారీ ప్రాజెక్టులు!

  • మంచు మనోజ్ దంపతుల కొత్త బిజినెస్ ప్లాన్.. 1,050 మందికి ఉద్యోగాలు!

  • ఏపీ పారిశ్రామిక రంగంలోకి భూమా మౌనిక.. నమస్తే వరల్డ్‌తో భారీ పెట్టుబడి!

Andhrapradesh: ప్రముఖ నటుడు మంచు మనోజ్, ఆయన భార్య భూమా మౌనిక ఇప్పుడు వ్యాపార రంగంలో కీలక అడుగు వేశారు. భూమా మౌనిక స్థాపించిన 'నమస్తే వరల్డ్' (Namasthe World) స్టార్టప్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కీలక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. విశాఖపట్నంలో నిర్వహించిన 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో ఈ ఒప్పందం జరిగింది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.36.24 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో వస్త్రాలు, చేనేత ఉత్పత్తులు, సంప్రదాయ బొమ్మల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బొమ్మలు, హస్తకళల ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. స్థానిక కళాకారుల నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటూ వారి ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో గుర్తింపు తీసుకురావడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ప్రాజెక్టులో మరో ప్రత్యేకత కూడా ఉంది. చేనేత కార్మికులు తయారు చేసే వస్త్రాలను దుస్తులుగా రూపొందించడంతో పాటు, మిగిలిపోయిన వస్త్రాలను వృథా చేయకుండా బొమ్మలు, సాఫ్ట్ టాయ్స్ తయారీకి ఉపయోగించనున్నారు. ఇలా పర్యావరణహిత తయారీ విధానానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ రెండు కేంద్రాల ద్వారా సుమారు 950 మందికి ప్రత్యక్షంగా, మరో 100 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. అంటే మొత్తం 1,050 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది.

ఈ సందర్భంగా భూమా మౌనిక మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయ కళలను ఆధునిక వ్యాపార అవకాశాలతో అనుసంధానించడమే తమ లక్ష్యమని తెలిపారు. స్థానిక కళాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ చేనేత, వస్త్రాలు, బొమ్మల తయారీ రంగాలను ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే తమ సంస్థకు రిలయన్స్ బ్రాండ్స్‌తో రిటైల్ భాగస్వామ్యం కూడా ఉందని పేర్కొన్నారు.

మరోవైపు మంచు మనోజ్ మాట్లాడుతూ సృజనాత్మకత, సాంకేతికత, వినోద రంగాలను సంప్రదాయ పరిశ్రమలతో అనుసంధానించాలనే ఆలోచన ఉందన్నారు. ఎటికొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీలో కృత్రిమ మేధస్సు (AI), రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో నమస్తే వరల్డ్ బొమ్మల కలెక్షన్‌ను పరిశీలించిన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సంస్థ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

ఇప్పటికే నమస్తే వరల్డ్ సంస్థ 55కు పైగా ప్రత్యేకమైన బొమ్మల డిజైన్లను రూపొందించగా, 43 వేలకు పైగా బీఐఎస్ గుర్తింపు పొందిన బొమ్మలను విక్రయించినట్లు సంస్థ వెల్లడించింది. తాజా ఒప్పందంతో సంప్రదాయ హస్తకళలకు ప్రోత్సాహం, స్థానికులకు ఉపాధి, రాష్ట్రంలో తయారీ రంగానికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి.

Tags

Be the first to react

Latest