వాహనాలే కాదు సైకిళ్లు, పాదచారులకు అమరావతిలో 3.5 వేల కి.మీ పైగా గ్రీన్ మొబిలిటీ రోడ్లు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఆధునిక నగరంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. కేవలం వాహనాలు వెళ్లేందుకు రోడ్లు నిర్మించడమే కాకుండా.. ప్రజలు నడిచేందుకు, సైకిళ్లపై ప్రయాణించేందుకు, పచ్చదనానికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తోంది. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం తగ్గించేలా సరికొత్త రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు రూపొందించింది.

Amaravathi green mobility plan
Amaravathi green mobility plan
  • అమరావతిలో పాదచారులు, సైక్లిస్టుల కోసం 3,200 కి.మీ. మేర ప్రత్యేక మార్గాల ఏర్పాటు.
  • ప్రతి స్మార్ట్ రోడ్డులో 3 మీటర్ల ఫుట్‌పాత్, 3 మీటర్ల సైకిల్ ట్రాక్, 3 మీటర్ల గ్రీన్ బెల్ట్.
  • ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం తగ్గించి పచ్చదనంతో కూడిన రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దడమే లక్ష్యం.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఆధునిక నగరంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. కేవలం వాహనాలు వెళ్లేందుకు రోడ్లు నిర్మించడమే కాకుండా.. ప్రజలు నడిచేందుకు, సైకిళ్లపై ప్రయాణించేందుకు, పచ్చదనానికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తోంది. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం తగ్గించేలా సరికొత్త రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు రూపొందించింది. 

నడిచేవారికి, సైకిళ్లకు ప్రత్యేక దారులు

అమరావతిలో ప్రతి ప్రధాన రహదారిపై పాదచారులు, సైకిళ్ల కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి స్మార్ట్ రోడ్డులో మూడు మీటర్ల వెడల్పుతో నడిచేవారికి ఫుట్‌పాత్, మరో మూడు మీటర్ల వెడల్పుతో సైకిల్ ట్రాక్ నిర్మించనున్నారు. వీటితో పాటు మూడు మీటర్ల మేర పచ్చదనం ఉండేలా మొక్కలు పెంచనున్నారు. సైకిళ్లపై వెళ్లేవారికి ఇబ్బంది లేకుండా ప్రత్యేక రంగులతో ట్రాక్‌లను గుర్తించనున్నారు.

ఏపీసీఆర్డీఏ ప్రణాళిక ప్రకారం అమరావతిలో దాదాపు 3,200 కిలోమీటర్ల మేర నడిచేవారికి, సైకిళ్లకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయనున్నారు. వీటిని నగరంలోని పార్కులతో అనుసంధానం చేయనున్నారు. దీంతో వాహనాలు ఉపయోగించకుండా కూడా ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సులభంగా వెళ్లే అవకాశం ఉంటుంది.

అన్ని సౌకర్యాలతో స్మార్ట్ రోడ్లు

అమరావతిలో నిర్మించే రోడ్లను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రూపొందిస్తున్నారు. రోడ్ల కిందనే తాగునీటి పైపులు, విద్యుత్ తీగలు, ఇంటర్నెట్ కేబుళ్లు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక మార్గాలు నిర్మిస్తున్నారు. మురుగునీరు, వర్షపు నీరు వెళ్లేందుకు కూడా ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.

రోడ్లతో పాటు ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లు ఒకే ప్రణాళికతో నిర్మిస్తున్నారు. అందమైన టైల్స్, భద్రతా ఏర్పాట్లు, వర్షపు నీరు నిల్వ ఉండకుండా వెళ్లేలా ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో రోడ్లను మళ్లీ మళ్లీ తవ్వాల్సిన అవసరం తగ్గుతుంది.

313 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారులు

రాజధానిలో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు గ్రిడ్ విధానంలో సుమారు 313 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మిస్తున్నారు. ప్రధాన రహదారులను 50 నుంచి 60 మీటర్ల వెడల్పుతో అభివృద్ధి చేస్తున్నారు. భవిష్యత్తులో వాహనాల సంఖ్య పెరిగినా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందుగానే ఈ రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు.

రూ.30,491 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు

అమరావతి అభివృద్ధిలో మరో ముఖ్యమైన ప్రాజెక్టు ఔటర్ రింగ్ రోడ్డు. సుమారు రూ.30,491 కోట్ల అంచనా వ్యయంతో ఆరు వరుసల రహదారిని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో 17 చోట్ల ఇతర రహదారులకు కలిసేలా ప్రత్యేక మార్గాలు (ఇంటర్‌ఛేంజ్‌లు) ఏర్పాటు చేయనున్నారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలకు రాకపోకలు సులభమవుతాయి. నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది.

పచ్చదనానికి ప్రాధాన్యం.. కాలుష్యానికి చెక్!

2019 నుంచి 2024 మధ్య నిర్లక్ష్యంతో కొన్ని ప్రాంతాలు ముళ్లపొదలతో అస్తవ్యస్తంగా మారగా.. ప్రస్తుతం రాజధానిని తిరిగి అభివృద్ధి చేసే పనులు వేగం పుంజుకున్నాయి. కూటమి ప్రభుత్వం రోడ్లు, భవనాల నిర్మాణంతో పాటు పచ్చదనం, ప్రజల సౌకర్యాలపై దృష్టి సారిస్తోంది.

మొత్తంగా అమరావతిని కేవలం వాహనాల నగరంగా కాకుండా.. ప్రజలు హాయిగా నడవగలిగే, సైకిళ్లపై ప్రయాణించగలిగే, పచ్చదనంతో నిండిన నగరంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రణాళికలు పూర్తిస్థాయిలో అమలైతే భవిష్యత్తులో అమరావతి పర్యావరణహిత నగరంగా ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశం ఉంది.

Tags

Be the first to react

Latest