పెట్టుబడుల్లో అమరావతి టాప్! ప్రాంతీయ సదస్సుల్లో రూ. 85,561 కోట్ల ఎంఓయూలు!

CII Partnership Summit: నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు ముందుగా ఏపీ ప్రభుత్వం ఐదు ప్రాంతాల్లో ప్రాంతీయ పెట్టుబడి సదస్సులను నిర్వహించింది. ఈ సదస్సుల్లో మొత్తం 195 ఎంఓయూల ద్వారా రూ. 85,561 కోట్ల విలువైన ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో అత్యధికంగా అమరావతి రీజియన్‌కు రూ. 42,947 కోట్లు రాగా, విశాఖకు రూ. 21,498 కోట్లు, శ్రీసిటీకి రూ. 11,731 కోట్లు లభించాయి. సింగపూర్ గ్రేటా సంస్థ రూ. 10,500 కోట్లు, హైయర్ సంస్థ రూ. 7,000 కోట్ల పెట్టుబడులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

పెట్టుబడుల్లో అమరావతి టాప్
పెట్టుబడుల్లో అమరావతి టాప్
  • శ్రీసిటీలో హైయర్ రూ. 7,000 కోట్లు!

  • ప్రకాశంలో సింగపూర్ కంపెనీ మెగా డీల్!

  • నవంబర్ 12న విశాఖలో సీఐఐ సమ్మిట్!

Visakapatnam: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ మరియు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) సంయుక్తంగా నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో ప్రతిష్టాత్మక 31వ 'సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్'ను నిర్వహించబోతున్నాయి. అయితే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పారిశ్రామిక అవకాశాలను విస్తరించే లక్ష్యంతో అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఐదు రీజియన్లలో ముందస్తుగా ప్రాంతీయ పెట్టుబడి సదస్సులను ప్రభుత్వం నిర్వహించింది. ఉత్తరాంధ్ర కోసం విశాఖలో, ఉమ్మడి గోదావరి జిల్లాలకు కాకినాడలో, కృష్ణా-గుంటూరు-ప్రకాశం పరిధికి అమరావతిలో, రాయలసీమ-నెల్లూరు జిల్లాల కోసం అనంతపురం మరియు శ్రీసిటీలలో ఈ సదస్సులు జరిగాయి.

195 ఎంఓయూలు.. రూ. 85,561 కోట్ల పెట్టుబడులు

ఈ ఐదు ప్రాంతీయ సదస్సుల్లో కలిపి మొత్తం 195 అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరాయి. వీటి ద్వారా మొత్తం రూ. 85,561 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు ప్రభుత్వానికి వచ్చాయి. ఏ ఒక్క ప్రాంతానికీ ప్రభుత్వం కృత్రిమంగా ప్రాధాన్యత ఇవ్వకుండా, ఆయా ప్రాంతాల్లో లభించే స్థానిక వనరులు, ముడిసరుకులు, భౌగోళిక అనుకూలతలకు అనుగుణంగా పెట్టుబడిదారులకు అవగాహన కల్పించింది. దీంతో అన్ని ప్రాంతాలకు వాటి సహజ సామర్థ్యం ఆధారంగా సహజ సిద్ధమైన పెట్టుబడులు వచ్చాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

అమరావతి రీజియన్‌కు సింహభాగం – రూ. 42,947 కోట్లు

ఐదు ప్రాంతీయ సదస్సుల్లో కెల్లా అత్యధికంగా అమరావతి రీజియన్ మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ ఏకంగా 60 ఎంఓయూల ద్వారా రూ. 42,947 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు నమోదయ్యాయి. రాజధాని నిర్మాణ ప్రాజెక్టులతో పాటు ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు భారీగా నిధులు తరలివచ్చాయి. సింగపూర్‌కు చెందిన 'గ్రేటా' సంస్థ ప్రకాశం జిల్లాలో తయారీ, ఖనిజాలు, గ్రీన్ కెమికల్స్ మరియు రీసైక్లింగ్ యూనిట్ల స్థాపనకు రూ. 10,500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. అలాగే గుంటూరు జిల్లాలో రూ. 3,000 కోట్లతో అంతర్జాతీయ స్థాయి బంగారు ఆభరణాల పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు 'ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్', రూ. 2,500 కోట్లతో ఇండస్ట్రియల్ పార్క్ కోసం ప్రగతి గ్రూప్ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

విశాఖ, రాయలసీమ, శ్రీసిటీల్లో కీలక రంగాలు

అమరావతి తర్వాత విశాఖపట్నం సదస్సులో రూ. 21,498 కోట్ల విలువైన 31 ఒప్పందాలు కుదిరాయి. ఇందులో హిమాద్రి కెమికల్స్ రూ. 5,000 కోట్లు, గ్రాన్యూల్స్ ఇండియా రూ. 4,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నాయి. శ్రీసిటీలో జరిగిన సదస్సులో 67 ఎంఓయూల ద్వారా రూ. 11,731 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ప్రముఖ గృహోపకరణాల సంస్థ 'హైయర్' (Haier) ఏకంగా రూ. 7,000 కోట్ల భారీ పెట్టుబడికి సంతకం చేసింది. అలాగే ఎలక్ట్రానిక్స్ & సెమీకండక్టర్లలో రూ. 2,000 కోట్లు, ఈవీ ఆటోమొబైల్ విడిభాగాల్లో రూ. 1,600 కోట్ల ఒప్పందాలు కుదిరాయి. అనంతపురంలో ఆటోమొబైల్, ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో రూ. 5,000 కోట్లు, కాకినాడ సదస్సులో రూ. 4,000 కోట్లకు పైగా ఒప్పందాలు జరిగాయి.

నవంబర్ సమ్మిట్‌పై భారీ అంచనాలు

గత సంవత్సరం విశాఖ సదస్సులో 613 ఒప్పందాల ద్వారా రూ. 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షల ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఎంఓయూలలో కనీసం 30 నుంచి 40 శాతం వాస్తవరూపం దాల్చినా రాష్ట్రానికి పెద్ద ముందడుగు అవుతుందని సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కల్లూరి విశ్లేషించారు. ప్రాంతీయ సదస్సుల్లోనే రూ. 85 వేల కోట్లకు పైగా రావడం శుభపరిణామమని, నవంబర్ 12, 13 తేదీల్లో జరిగే ప్రధాన సీఐఐ గ్లోబల్ సమ్మిట్‌లో మరింత పెద్ద ఎత్తున గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Tags

Be the first to react

Latest