విశాఖపట్నం నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రహదారి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో విశాఖ ఎంపీ శ్రీభరత్ కేంద్ర స్థాయిలో కీలక ప్రయత్నాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖ నగరం వేగంగా విస్తరిస్తున్న పరిస్థితుల్లో రహదారి వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన కేంద్ర మంత్రికి వివరించారు.
ప్రధానంగా ఆనందపురం జంక్షన్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎంపీ శ్రీభరత్ వినతి చేశారు. విశాఖ నుంచి భోగాపురం, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో ఆనందపురం జంక్షన్ వద్ద నిత్యం తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఇప్పటికే డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధం చేసి ప్రతిపాదనలు పంపినట్లు కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. ఆ డీపీఆర్‌కు త్వరితగతిన ఆమోదం తెలపాలని ఆయన కోరారు. ప్రాజెక్ట్ అమలైతే ట్రాఫిక్ కష్టాలు తగ్గడమే కాకుండా ప్రయాణికులకు సమయం, ఇంధనం ఆదా అవుతాయని వివరించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్న నేపథ్యంలో, దానికి అనుగుణంగా అధిక సామర్థ్య రవాణా వ్యవస్థ అవసరమని ఎంపీ శ్రీభరత్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. విమానాశ్రయం ప్రారంభమైతే విశాఖ ప్రాంతానికి భారీగా ప్రయాణికుల రాకపోకలు పెరుగుతాయని, అందుకే ముందస్తుగా రహదారి కనెక్టివిటీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. భోగాపురం ఎయిర్ పోర్ట్‌కు అనుసంధానంగా వీఎంఆర్‌డీఏ పరిధిలో నగర రహదారుల అభివృద్ధి, సర్వీస్ రోడ్ల వెడల్పు పెంపు, కొత్త ఎంట్రీ–ఎగ్జిట్ పాయింట్ల ఏర్పాటు అత్యవసరమని వివరించారు.
అలాగే జంక్షన్‌ల డిజైన్‌లో మార్పులు చేసి ఆధునిక ట్రాఫిక్ నిర్వహణ విధానాలను అమలు చేయాలని ఆయన సూచించారు. ఈ మార్పులకు కేంద్ర ప్రభుత్వ స్థాయి నుంచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఎంపీ శ్రీభరత్ కోరారు. రహదారి అభివృద్ధి పనులు సమగ్రంగా జరిగితే పరిశ్రమలు, ఐటీ రంగం, పర్యాటకం వంటి రంగాలకు విశాఖ మరింత ఆకర్షణీయంగా మారుతుందని తెలిపారు.
భూసేకరణకు సంబంధించిన సమస్యలు కొన్ని ప్రాజెక్టుల అమలులో అడ్డంకిగా మారుతున్నాయని ఎంపీ శ్రీభరత్ కేంద్ర మంత్రికి వివరించారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర స్థాయిలో వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమని, అందుకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ చొరవ తీసుకోవాలని కోరారు. భూసేకరణ అంశాలు సత్వరమే పరిష్కారమైతే ప్రాజెక్టులు ఆలస్యం లేకుండా పూర్తయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఎంపీ శ్రీభరత్ వినతులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. విశాఖ ప్రాంతం అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులపై కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన భరోసా ఇచ్చినట్లు తెలిసింది. ఆనందపురం జంక్షన్ అభివృద్ధి, భోగాపురం ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీ వంటి కీలక అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీతో విశాఖ రహదారి అభివృద్ధి ప్రణాళికలకు కీలక పాత్ర పోషించనుంది.