విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనే ఆశయం ఉన్న భారతీయ విద్యార్థులకు బ్రిటిష్ కౌన్సిల్ ఒక శుభవార్త అందించింది. యూకేలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చేయాలనుకునే ప్రతిభావంతులైన భారతీయ విద్యార్థుల కోసం ‘గ్రేట్ స్కాలర్‌షిప్స్ 2026–27’ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ స్కాలర్‌షిప్ ద్వారా ఆర్థిక భారం తగ్గి, అంతర్జాతీయ స్థాయి విద్యను పొందేందుకు అవకాశం కలుగుతుందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు.
ఈ కార్యక్రమం కింద మొత్తం 12 స్కాలర్‌షిప్‌లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఒక్కో స్కాలర్‌షిప్ విలువ కనీసం 10 వేల పౌండ్లు ఉండగా ఇది భారతీయ కరెన్సీలో దాదాపు 10 లక్షల రూపాయలకు సమానం. ఈ మొత్తం యూకేలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఒక సంవత్సరం పాటు కొనసాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల ట్యూషన్ ఫీజులకు ఉపయోగపడుతుంది. యూకే ప్రభుత్వానికి చెందిన గ్రేట్ బ్రిటన్ క్యాంపెయిన్, బ్రిటిష్ కౌన్సిల్ మరియు పలు యూనివర్సిటీలు కలిసి ఈ స్కాలర్‌షిప్‌కు నిధులు సమకూరుస్తున్నాయి.
ఈ స్కాలర్‌షిప్‌లను అందిస్తున్న యూనివర్సిటీల జాబితా కూడా ఆసక్తికరంగా ఉంది. బ్రిస్టల్ యూనివర్సిటీ, క్వీన్‌స యూనివర్సిటీ బెల్‌ఫాస్ట్, యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్, యూనివర్సిటీ ఆఫ్ సరీ, యూనివర్సిటీ ఆఫ్ డండీ వంటి పేరొందిన విద్యాసంస్థలు ఇందులో ఉన్నాయి. అలాగే రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్, రాయల్ కన్సర్వటోయర్ ఆఫ్ స్కాట్లాండ్, రాయల్ నార్తర్న్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ లాంటి ప్రత్యేక విద్యాసంస్థలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి. దీంతో కళలు, సంగీతం, డిజైన్, సైన్స్, మేనేజ్‌మెంట్ వంటి విభిన్న విభాగాల్లో చదవాలనుకునే వారికి అవకాశం లభిస్తుంది.
ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కొన్ని అర్హతలు తప్పనిసరిగా కలిగి ఉండాలి. భారతదేశ పౌరులై ఉండటం, గుర్తింపు పొందిన యూనివర్సిటీలో అండర్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి ఉండటం అవసరం. ఎంపిక చేసిన కోర్సుపై స్పష్టమైన ఆసక్తి, చదవాలనే లక్ష్యం ఉండాలి. అలాగే సంబంధిత యూనివర్సిటీ నిర్దేశించిన ఇంగ్లిష్ భాషా అర్హతలను కూడా పూర్తి చేయాలి. చదువు పూర్తయ్యాక యూకే విద్యా వ్యవస్థకు ప్రతినిధిగా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉండాలనే నిబంధన కూడా ఉంది.
ఎంపికైన విద్యార్థులకు కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాకుండా, యూకేలో నిర్వహించే నెట్‌వర్కింగ్ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. చదువు పూర్తయ్యాక తమ అనుభవాలను భవిష్యత్ విద్యార్థులతో పంచుకోవడం ద్వారా ఈ కార్యక్రమానికి సహకరించాల్సి ఉంటుంది. ఇది భారత్–యూకే విద్యా సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా రూపొందించబడింది.
స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు ఆయా యూనివర్సిటీల అధికారిక వెబ్‌సైట్లను సందర్శించాల్సి ఉంటుంది. ప్రతి యూనివర్సిటీకి దరఖాస్తు చివరి తేదీ వేర్వేరుగా ఉండటంతో, అభ్యర్థులు ముందుగానే వివరాలు తెలుసుకుని అప్లై చేయాలని సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే, యూకేలో ఉన్నత విద్యపై కలలు కంటున్న భారతీయ యువతకు ఈ గ్రేట్ స్కాలర్‌షిప్ ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.