కృష్ణా జిల్లా గుడివాడలోని చారిత్రాత్మక అక్కినేని నాగేశ్వరరావు (ఎ.ఎన్.ఆర్) కళాశాల వజ్రోత్సవ వేడుకలతో కోలాహలంగా మారింది. ఈ విద్యాలయం కేవలం ఒక విద్యాసంస్థ మాత్రమే కాదు, వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన ఒక గొప్ప జ్ఞాన దేవాలయం. డిసెంబర్ 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ వజ్రోత్సవ (75 ఏళ్ల) సంబరాల్లో భాగంగా రెండవ రోజు కార్యక్రమం అక్కినేని కుటుంబ సభ్యుల రాకతో ఎంతో సందడిగా, భావోద్వేగంగా సాగింది.
రెండవ రోజు జరిగిన ఈ కార్యక్రమంలో దివంగత నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి పెద్ద కుమారుడు వెంకట్, ఆయన భార్య జ్యోత్స్న, కుమార్తె నాగ సుశీల, మరియు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పాల్గొన్నారు. తమ తండ్రి పేరు మీద ఉన్న ఈ కళాశాల ఇంతటి ఉన్నత స్థాయికి చేరుకోవడం పట్ల వారు గర్వంగా ఫీల్ అయ్యారు.
కార్యక్రమంలో నాగార్జున చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఆయన తన తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. "ఇటీవలే నాన్నగారి శతజయంతి వేడుకలు జరుపుకున్నాం. ఈ కాలేజీకి 75 ఏళ్లు, అన్నపూర్ణ స్టూడియోస్‌కి 50 ఏళ్లు, ఫిల్మ్ స్కూల్‌కి 10 ఏళ్లు పూర్తయ్యాయి. ఇవన్నీ చూస్తుంటే సంతోషం కంటే గర్వంగా ఉంది."
“మనుషులు శాశ్వతం కాదు, కానీ వారు చేసే పనులు శాశ్వతంగా నిలిచిపోతాయి. నాన్నగారు స్వయంగా పెద్దగా చదువుకోకపోయినా, వేలాది మందికి చదువు అందాలని ఈ కాలేజీని స్థాపించారు.” నేను పుట్టిన సంవత్సరం 1959లో నాన్నగారు ఈ కాలేజీ కోసం లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. అప్పట్లో ఆయన సినిమా పారితోషికం కేవలం ఐదు లేదా పది వేలు మాత్రమే. అంటే 10 సినిమాల కష్టార్జితాన్ని చదువు కోసం ఇచ్చేశారన్నమాట.
తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ, విద్యార్థుల భవిష్యత్తు కోసం అక్కినేని కుటుంబం ఒక కీలక ప్రకటన చేసింది. ప్రతి ఏటా ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు 'అక్కినేని నాగేశ్వరరావు' పేరు మీద స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
ఇందుకోసం మూలధనంగా (Corpus Fund) రూ. 2 కోట్ల చెక్కును కాలేజీ కమిటీకి నాగార్జున అందజేశారు. ఈ సొమ్ముపై వచ్చే వడ్డీతో నిరంతరం విద్యార్థులకు ఆర్థిక సహాయం అందనుంది. కాలేజీని ఆధునిక కాలానికి అనుగుణంగా మార్చేందుకు కొత్తగా స్కిల్ డెవలప్‌మెంట్ ఫ్యాకల్టీని ప్రారంభిస్తున్నారు.
ఈ విభాగాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు (ముగింపు ఉత్సవం రోజున) గుడివాడ రానున్నారు. స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు కాలేజీ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని నాగార్జున అభినందించారు.
ఈ వేడుకలో మాజీ పార్లమెంట్ సభ్యులు కావూరి సాంబశివరావు, రాజ్యసభ మాజీ సభ్యులు యలమంచిలి శివాజీ, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మరియు జస్టిస్ భట్టు దేవానంద్ వంటి ప్రముఖులు పాల్గొని అక్కినేని నాగేశ్వరరావు గారి సేవలను కొనియాడారు. కేవలం సినిమా రంగంలోనే కాకుండా, విద్యా రంగంలోనూ ఏఎన్‌ఆర్ గారు వేసిన ముద్ర చెరగనిదని వారు అభిప్రాయపడ్డారు.
గుడివాడ ఏఎన్‌ఆర్ కాలేజీ వజ్రోత్సవాలు ఒక విద్యాసంస్థ పండుగలా కాకుండా, ఒక ఊరి పండుగలా జరిగాయి. అక్కినేని కుటుంబం ప్రకటించిన రూ. 2 కోట్ల విరాళం భవిష్యత్తులో మరెంతో మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చేలా తోడ్పడుతుందని ఆశిద్దాం.