రాష్ట్రాభివృద్ధి లక్ష్యాలను నిబద్ధతతో ముందుకు తీసుకువెళ్లాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి, అటవీ–పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లు బాధ్యతాయుతంగా, ప్రజల అవసరాలను అర్థం చేసుకుంటూ పనిచేస్తే కూటమి ప్రభుత్వ సంకల్పాలు మరింత వేగంగా అమలవుతాయని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన 5వ కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో జిల్లా కలెక్టర్ల పాత్ర అత్యంత కీలకమని ఇప్పటివరకు ప్రభుత్వ లక్ష్యాల సాధనలో కలెక్టర్లు చూపిన చొరవ అభినందనీయమని, భవిష్యత్తులో కూడా అదే ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించడాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నట్లు వివరించారు. అడవి తల్లి బాట పేరుతో చేపట్టిన రహదారి ప్రాజెక్టు ద్వారా మారుమూల గిరిజన ప్రాంతాలకు కనెక్టివిటీ మెరుగుపడుతుందని, ఈ కార్యక్రమాన్ని సంబంధిత జిల్లాల కలెక్టర్లు సమర్థంగా అమలు చేస్తున్నారని తెలిపారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పల్లె పండుగ 1.0’ కార్యక్రమం నిర్దేశిత గడువులోగా పూర్తి కావడం ప్రభుత్వ సమన్వయానికి నిదర్శనమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నరేగా నిధులతో గ్రామాల్లో సుమారు నాలుగు వేల కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్లు పూర్తి చేసినట్లు చెప్పారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని వివరించారు. రైతులకు అండగా నిలిచేలా 22,500 మినీ గోకులాలు, 15 వేల నీటి తొట్టెలు, 1.2 లక్షల ఫామ్ పాండ్లు నిర్మించామని తెలిపారు. ఇవన్నీ సకాలంలో పూర్తి కావడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఊతం లభించిందన్నారు.
ఉపాధి కల్పన విషయంలోనూ ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 41.12 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించామని, మొత్తం 15.95 కోట్ల పని దినాల ద్వారా రూ.4,330 కోట్ల వేతనాలు చెల్లించామని వెల్లడించారు. అలాగే మెటీరియల్ కాంపోనెంట్ కింద మరో రూ.1,056.85 కోట్లను బిల్లుల రూపంలో చెల్లించడం జరిగిందని తెలిపారు. ఈ చర్యలన్నీ గ్రామీణ ప్రజలకు ఆర్థిక భరోసాగా నిలిచాయని చెప్పారు.
గ్రామ పంచాయతీల స్వయం ఆదాయ వనరుల పెంపుపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ సూచించారు. పన్నులు, నాన్ టాక్స్ ఆదాయాలను డిజిటలైజ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ శిక్షణ కార్యక్రమాల్లో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం గర్వకారణమని చెప్పారు. ఈ శిక్షణల వల్ల ఉద్యోగుల సామర్థ్యం పెరిగిందని, గ్రామస్థాయిలో పాలనా నైపుణ్యాలు మెరుగుపడేందుకు ఇవి దోహదపడుతున్నాయని వివరించారు.
జూన్ నెలలో ప్రారంభించిన ‘స్వచ్ఛ రథం’ కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఒక యూనిట్‌తో ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రస్తుతం 25 యూనిట్లకు విస్తరించిందని చెప్పారు. అలాగే పీఎం జన్మన్ పథకం, నరేగా సహకారంతో గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మించే కార్యక్రమంలో కొన్ని జిల్లాలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయని పేర్కొన్నారు. అటవీ అనుమతుల విషయంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ అన్ని అనుమతులు పూర్తి చేయగా, అల్లూరి జిల్లా కలెక్టర్ కూడా అధిక శాతం అనుమతులు సాధించారని వివరించారు. ఇవన్నీ కలెక్టర్ల నిబద్ధతకు నిదర్శనమని, ఇదే ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.